ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాల్సిందే
హమాస్ కు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక 2025 జనవరి 25 వరకు డెడ్ లైన్
వాషింగ్టన్: తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్–రష్యా, ఇజ్రాయెల్–హమాస్–లెబనాన్ ల యుద్ధం సమసిపోయేలా చర్యలు తీసుకుంటానన్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హమాస్ కు మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. 2025 జనవరి 20 వరకు ఇజ్రాయెల్ బందీలను విడవకపోతే హమాస్ చరిత్ర ముగిసినట్లేనని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. తనప్రమాణ స్వీకారానికి ముందే బందీలను విడుదల చేయాలని లేకుంటే మధ్యప్రాచ్యంలో మరో తుపాను వస్తుందని మానవత్వానికి వ్యతిరేకంగా అఘాయిత్యాలకు పాల్పడిన వారిని వదలమని హెచ్చరించారు. ఇజ్రాయెల్ కు చెందిన 250 మంది బందీలను హమాస్ తమ ఆధీనంలో ఉంచుకుంది. ఇందులో 150 మంది విడుదల కాగా, మరో వందమంది వారి వద్దే బందీలుగా ఉన్నారు. బందీలను విడుదల చేయాలనే షరతుతో ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడిచేశారు. ఈ దాడుల్లో 1200మంది మృతి చెందగా, 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. అనంతరం ఇజ్రాయెల్ గాజా, లెబనాన్ లపై విరుచుకుపడి హమాస్, హిజ్బుల్లా పెద్ద నాయకులను మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ సాగించిన ఈ యుద్ధంలో గాజా భస్మీపటలమైంది. సుమారుగా 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 44వేల మందికిపైగా మరణించారు. గాజాలో ప్రస్తుతం నివాసయోగ్యంగా ఒక్క భవనం కూడా మిగలలేదు.