పలు గ్రామాలపర్యటన
సమస్యలను పరిష్కరిస్తాం
ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ చార్జీ ఆత్రం సుగుణక్క
నా తెలంగాణ, ఆదిలాబాద్: నార్నూర్ గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ చార్జీ ఆత్రం సుగుణక్క అన్నారు. బుధవారం నార్నూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మాలేపూర్ గ్రామ పంచాయితీ చిత్తగూడ గ్రామంలో ప్రజలతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి వెళ్లే రహదారిలో వాగుపై ఉన్న వంతెన గత నాలుగు ఏళ్ల క్రితం వరదలతో కొట్టుకుపోవడంతో సరైన రహదారి లేక కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు విన్నవించారు.
స్పందించిన సుగుణక్క గ్రామంలో అంగన్ వాడీ కేంద్రంతో పాటు అంతర్గత రహదారులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులకు ప్రధాన సమస్యగా మారిన వాగుపై వంతెనను త్వరితగతిన పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అనంతరం భాబేఝరి పంచాయతీ చిత్తగూడ సమీపంలో ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. నూతన వంతెన నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. భాబేఝరి గ్రామంలో వినాయకుడికి పూజలు చేసి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ప్రధాన రహదారితో పాటు, వంతెన నిర్మాణం కోసం ఇంచార్జీ మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.
సుంగాపూర్ గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పథకం పనిచేయక తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు తెలుపగా వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ గత బీఆర్ఎస పదేళ్ల పాలనలో గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలాయని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రజా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికావద్దని త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. రూ. 2 లక్షల ఋణమాఫీ అందరికీ అందుతుందని, సాంకేతిక సమస్యల వల్ల కొంతమంది రైతులకు ఋణమాఫీ అందకపోయినా త్వరలోనే అందరికీ అందేలా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లోకండె దేవ్ రావు,షేక్ హైమద్, మాలేపూర్ మాజీ సర్పంచ్ పవార్ ఇందల్, ఉపసర్పంచ్ మెట్టె బాపూరావు, భాబేఝరి మాజీ సర్పంచ్ లు మెస్రం దిగంబర్, మర్సకోల నాందేవ్, సుంగాపూర్ మాజీ సర్పంచ్ ప్రేమ్ సింగ్, ఉమేష్, గజానన్, శ్రావణ్, శేషారావు తదితరులు పాల్గొన్నారు.