కేసుల దర్యాప్తు.. బాధితులకు అండ

సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి మాదకద్రవ్యాలు అరికట్టాలి సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ 

Aug 24, 2024 - 20:10
 0
కేసుల దర్యాప్తు.. బాధితులకు అండ
నా తెలంగాణ, సంగారెడ్డి: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ పోలీసు అధికారులను ఆదేశించారు. నెలలవారీ క్రైమ్​ సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. 
 
నెలవారీ క్రైమ్ రివ్యు సమావేశంలో భాగంగా శనివారం  సంగారెడ్డి జిల్లాపరిషత్ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాతనేరస్థులపై నిరంతర నిఘా అవసరమన్నారు. నేరస్థులపై రౌడీ షీట్స్​ తెరవాలన్నారు. 
 
ఆన్​ లైన్​ మోసాలు, డ్రగ్స్​, గంజాయి సాగు, అక్రమ రవాణాలపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలన్నారు. వీటిని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. గంజాయి సాగును ఎవ్వరూ చేసినా ఉపేక్షించరాదని క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని సూచించారు. ఆ భూములను కూడా ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. అదే సమయంలో ఆన్​ లైన్​ మోసాలపై కూడా అవసరమని తెలిపారు. మోసాలకు గురైతే వెంటనే 1030కు సమాచారం అందించేలా ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. 
 
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. యాక్సిడెంట్​ జోన్​ లను గుర్తించి సైన్​ బోర్డుల ఏర్పాటు చేయాలని తెలిపారు. డ్రంకన్​ డ్రైవింగ్​ టెస్టులను రోజువారీగా ఒకే ప్రాంతాల్లో కాకుండా వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. నెంబర్​ ప్లేట్స్​ లేని వాహనాలపై దృష్టి సారించి వారి వివరాలను ఆరా తీయాలన్నారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. 
 
ఈ సమీక్షా సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్​ రెడ్డి, నారాయణ ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి, ఎ.ఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నగేష్, ఐ.టి. సెల్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్.ఒ.టి. ఇన్స్పెక్టర్ మల్లేశం, నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.