- శాంతి విధానంపై ప్రపంచ దేశాల దృష్టి
- పతాక శీర్షికల్లో వార్తలు
- భారత్ విధానాలు ప్రపంచదేశాలకు ఆదర్శప్రాయం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే ఆలోచన, ఓపిక, విశ్లేషణ, బంధాలు, బాంధవ్యాలు అత్యంత క్రియాశీలకంగా ఉంటాయి. అదే ఒక దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే అనేక అంశాలపై దృష్టి సారించాల్సిన, బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓ వైపు ప్రపంచదేశాల చూపంతా భారత్ వైపు ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారంపై మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన కూడా ఈ దిశలోనే సాగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చూపు మోదీ పర్యటన, వ్యవహారశైలి, ఆయన ప్రసంగంపై దృష్టి కేంద్రీకరించాయి. ప్రభుత్వాలనే నిర్దేశించే స్థాయిలో ఉన్న పలు బడా మీడియా గ్రూపులు పతాక స్థాయిలో మోదీ పర్యటనను కవర్ చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. బీబీసీ, ది గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, డాన్, రష్యన్, ఉక్రెయిన్, చైనా ఇలా ప్రపంచదేశాలన్నింటీ చూపు మోదీ పర్యటనపై నెలకొని పతాక శీర్షికలో పర్యటనకు సంబంధించి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత ప్రధాని మోదీ రష్యా, ఉక్రెయిన్ లతో వ్యవహరించిన తీరు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని వెల్లడించాయి. అదే సమయంలో ఒక నాయకుడికి ఉండాల్సిన పరిపూర్ణతను మోదీ సాధించగలరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని వెల్లడించాయి. కఠినమైన సమస్యలను కూడా అలవోకగా, తెగింపుతో ఎదుర్కునే ధైర్యాన్ని మోదీ (భారత్) కలిగి ఉందని ప్రశంసలు కురిపించాయి. దేశ సమతుల్యత దెబ్బతినకుండా ఇతరుల అహానికి భంగం వాటిల్లకుండా మోదీ విదేశాంగ విధానం వ్యవహారశైలిని ప్రశంసించాయి. చాలాయేళ్ల తరువాత ఉక్రెయిన్ పర్యటనను చేపట్టి మోదీ చారిత్రాత్మక విజయానికి నాందీ పలికారని వర్ణించాయి. అనేక దేశాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేసేలా శాంతిమార్గం ద్వారా సులువైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చని మరోమారు ప్రధాని మోదీ వెల్లడించడాన్ని స్వాగతించాయి. అదే సమయంలో ఉక్రెయిన్ అమరవీరులకు నివాళులర్పించినా, రష్యా దాడిని మాత్రం వ్యతిరేకించకపోవడాన్ని మోదీ రాజనీతిని ప్రశంసించాయి. ఈ రెండు దేశాల శాంతికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే తమ సహకారం ఉంటుందని కానీ ఈ దేశాలే ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని ఊటంకించాయి. సంక్లిష్టమైన పర్యటనలోనూ భారత విదేశాంగ శాఖ పలు ఒప్పందాలను చేసుకోవడాన్ని దేశాభివృద్ధికి సూచికగా వెల్లడించాయి. రష్యా–ఉక్రెయిన్ ల మధ్య సమస్యల పరిష్కారం ద్వారా యుద్ధం ఆపేందుకు మోదీ పూర్తి మద్ధతునిస్తున్నట్లు శత్రుదేశాల మీడియా కూడా ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఏది ఏమైనా కీలకమైన మోదీ పర్యటన విజయవంతంతో ప్రపంచదేశాల్లో మరోమారు మోదీ (భారత్) కీర్తి పతాకలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.