యథేచ్ఛగా చెట్ల నరికివేత

స్థానిక నేతల హస్తం

Oct 22, 2024 - 07:44
Oct 22, 2024 - 07:56
 0
యథేచ్ఛగా చెట్ల నరికివేత
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి 
నేలకూలిన పచ్చని చెట్లు
స్థానికుల ఆవేదన
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటి వృక్షాలుగా అభివృద్ధి చేసి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంటే  పర్యావరణన్ని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పుర అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలో కొందరు చెట్లను నరికివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే పట్టణంలోని భగత్ సింగ్ నగర్ జయ శంకర్ విగ్రహానికి అనుకుని సింగరేణి స్థలంలో ఉన్న కొన్ని చెట్లను తొలగించారు. దీంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఉన్నతాధికారి ఎఇ. అచ్యుత్ ని వివరణ కోరగా ఓపెన్ జిమ్ ను అనుకొని ఉన్న స్థలాన్ని వాకింగ్ ట్రాక్ కొరకు చదును చేసినట్లు తెలిపారు. కాగా ఎస్.డి 180 సింగరేణి క్వాటర్ కు అనుకుని ఉన్న స్థలం సింగరేణి ఆధ్వర్యంలోనే ఉందని ప్రభుత్వానికి ఇంకా సరేండర్ చేయలేదని సింగరేణి అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ స్థలం కొంత భాగం కబ్జాకు గురైందన్నారు. 
 
నాయకుని కనుసన్నల్లో అధికారుల పనులు..
సింగరేణి స్థలంలో ఉన్న చెట్లను నరికి వేయడానికి పట్టణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు ముఖ్య భూమిక పోషించాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పర్యావరణన్ని కాపాడానికి ప్రభుత్వం ఒప్పంద ప్రతిపాదికన ఓ ఎన్విరాన్​ మెంట్​ ఇంజనీర్ ని నియమించి, ప్రతి నెలా వేలాది రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల చెట్లు నరికి వేతకు గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్య్తక్తం చేస్తున్నారు. అధికార పార్టీ కౌన్సిలర్ కనుసన్నుల్లో అధికారులు పనులు వెలగబెడుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
పట్టించుకోరా స్థానికుల ఆవేదన..
చెట్లను నరికివేసిన ఘటనపై స్థానిక అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని అలాగే ప్రభుత్వ అధికారులు వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని పర్యావరణ ప్రేమికులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.
 
సింగరేణి స్థలాలను ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం -సింగరేణి ఎస్టేట్ అధికారి..
సింగరేణి క్వార్టర్ ల ప్రక్కన గాని, ఇతర సింగరేణి ఖాళీ స్థలాలను ఆక్రమిస్తే వారి పై కేసులు నమోదు చేస్తామని మందమర్రి ఏరియా ఎస్టేట్స్ అధికారి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. కార్మికులకు, ప్రజలకు ఉపయోగపడే ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం యాజమాన్యం సహకరించందని ఆ స్థలం సింగరేణి ఆధీనంలోనే ఉన్నదని స్పష్టం చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలో భగత్ సింగ్ నగర్  క్వార్టర్ల ప్రక్కన గల ఖాళీ స్థలాన్ని ఆక్రమించే క్రమంలో భాగంగా ఏపుగా పెరిగిన వృక్షాలను తొలగించిన ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేయనున్నట్లు తెలిపారు. సింగరేణికి చెందిన స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.