-సభను బహిష్కరించిన బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు
-పుర కమిషనర్ తీరును ఖండించిన
ప్రజాప్రతినిధులు
-ఇందిరమ్మ కమిటీలా? కాంగ్రెస్ కమిటీలా?
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశాన్ని బిఆర్ఎస్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు బహిష్కరించారు. సమావేశం నుంచి బయటకు వచ్చి బిఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. సభను బహిష్కరించిన కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగిందని, సమావేశాలను పుర కమిషనర్ తూ తూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారని కౌన్సిలర్లు మండిపడ్డారు. పుర కమిషనర్ తీరును ఖండిస్తున్నామని, తన ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కొన్ని నెలలుగా జనరల్ ఫండ్ నుంచి వార్డుకు రూ.5 లక్షలను కేటాయించాలని, సమస్యలను కమిషనర్ దృష్టి కి తీసుకుని వెళ్లినపటికి ఫండ్స్ లేవంటూ చెపుతూ, ఆయన కేవలం కొందరు అధికార రాజకీయ నాయకులతో పుర కార్యాలయంలో మంతనాలు జరుపుతూ వారికి అనుగుణంగా పనులను చక్క పెడుతున్నారని ఆరోపించారు. గత సంవత్సరం తమ ప్రభుత్వం పుర అభివృద్ధి పనుల కోసం డి.ఎం.ఎఫ్.టి ఫండ్స్ రూ.11 కోట్ల వ్యయాన్ని వెచ్చించగా అందులో బీటీ రోడ్లకు రూ.4 కోట్లు, వార్డుల అభివృద్ధి కొరకు మిగిలిన రూ.7 కోట్లు కేటాయించగా ఇప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే డి.ఎం.ఎఫ్.టి ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఖజానా ఖాళీగా ఉందని అంటూ సమాధానం చూపుతున్నారని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పురపాలకంలో మూడు కమ్యూనిటి భవనాల కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచి పూర్తి చేసిన పనులను సైతం నిర్మాణాలు మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వమే పనులను నిలిపివేసిందని మండిపడ్డారు.
-ఇందిరమ్మ కమిటీలా? కాంగ్రెస్ కమిటీలా.?
ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నేతల పేర్లతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఎవరికి సమాచారం లేకుండానే కమిషనర్, కాంగ్రెస్ నేతలకు నచ్చిన పేర్లతో జాబితాను సిద్ధం చేశారని పలువురు కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ పేర్ల జాబితాను సిద్ధం చేసినట్లు తమకు తెలియదని చైర్మన్, వైస్ చైర్మన్ అనడం ఇక్కడ గమనార్హం. తమది పారదర్శక ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీల పేర్లను కౌన్సిలర్ల ఆమోదం లేకుండా ఎలా వేస్తారని కమిషనర్ ను ప్రశ్నించారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.
-ఎలా ఆమోదిస్తారు..
సర్వసభ్య సమావేశాని 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఒక్కరు బీజేపీ కౌన్సిలర్, ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించినప్పటికి పుర కమిషనర్ రెండు టేబుల్ ఎజెండ్ ప్రతిపాదించి 11 అంశాలను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు.