తరంగ్ శక్తి విన్యాసాల్లో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
జైపూర్: రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారతదేశం వేగంగా పురోగమిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గురువారం రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో భారత–ఫ్రాన్స్ ల బహుపాక్షిక వైమానిక విన్యాసాలు ‘తరంగ్ శక్తి–2024’లో పాల్గొన్నారు. వైమనిక విన్యాసాలను తిలకించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. ఆయుధాలు, విమానాలు, రక్షణ పరికరాలను దేశీయంగానే రూపొందించడంలో భారత్ కీలక అడుగులు వేస్తోందన్నారు. అదే సమయంలో ఇతర దేశాలతో కలిసి రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో ముందున్నామని తెలిపారు. వైమానిక రంగంలో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, సెన్సార్లు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వంటి రంగాలలో ఎక్కువగా స్వయం సమృద్ధిగా మారాయన్నారు.
ప్రస్తుతం భారత్ ఆయుధాల దిగుమతి నుంచి ఎగుమతిదారుగా మారిందన్నారు. 90దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. జోధ్ పూర్ లో ఫ్రాన్స్–భారత్ మధ్య వైమానిక విన్యాసాలు జరగడం సంతోషకరమన్నారు. ఇరుదేశాల రక్షణకు ఈ కార్యక్రమం ఓ చక్కటి వేదిక అని తెలిపారు. దీంతో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
రక్షణ రంగాల్లో సహకారంతో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.