బాలరాముడి ప్రాణప్రతిష్ఠ విఘాతానికి విదేశీ కుట్ర
హ్యాకర్ల ప్రయత్నాన్ని తిప్పికొట్టిన భారత్ 1244 ఐపీల నుంచి ఆయా విభాగాలపై హ్యాకర్ల దాడి ఏఐ టెక్నాలజీతో అడ్డుకున్న భారత నిపుణులు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై చైనా, పాక్ లకు చెందిన హ్యాకర్లు కార్యక్రమానికి విఘాతం కలిగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని భారత ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు పుసగుచ్చినట్లు వివరించడంతో సమాచారం బయటికి పొక్కింది. హ్యాకర్ల ప్రయత్నాలను సాంకేతిక నిపుణుల బృందం విఫలం చేసింది. రామమందిర ఆలయ ట్రస్టు, యూపీ టూరిజం, పోలీసు, ఎయిర్ పోర్ట్, ప్రసార భారతి ఇలా అనేక వెబ్ సైట్ల హ్యాకింగ్ కు ప్రయత్నించారని టీఎస్ఓసీ (భారతదేశ టెలికాం ఆపరేషన్ సెంటర్) అధికారులు గుర్తించారు. కానీ సమాచారాన్ని బయటికి రానీయలేదు. హ్యాకింగ్ పై సంయుక్తంగా చర్యలు చేపట్టి నిర్వీర్యం చేశారు. ఒక్క ప్రసారభారతిని హ్యాక్ చేసేందుకే 140 ఐపీ అడ్రస్ ల నుంచి ప్రయత్నాలు జరిగాయి.
మొత్తం1244 ఐపీ చిరునామాలను అధికారులు బ్లాక్ చేశారు. ఇందులో 999 చైనాకు చెందినవి కాగా, మిగిలినవి పాక్, హాంకాంగ్, కంబోడియాల నుంచి హ్యాకింగ్ కు ప్రయత్నించారు. మరికొన్ని భారతదేశంలోని ఐపీ అడ్రస్ ల నుంచి కూడా హ్యాకర్లు ఈ వెబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించగా ఇప్పటికే ఆయా ఐపీ అడ్రస్ ల ద్వారా హ్యాకర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జీ–20 సమ్మిట్ సందర్భంగా కూడా హ్యాకింగ్ కు తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయని తెలుస్తోంది. డిజిటల్, మౌలిక సదుపాయాలు, మంత్రిత్వ రంగాలకు చెందిన వెబ్ సైట్ల హ్యాకింగ్ కు ప్రయత్నించగా, భారత సాంకేతిక బృందం ఈ చర్యలను తిప్పికొట్టింది. కాగా హ్యాకింగ్ ను అడ్డుకునేందుకు ఇటీవలే భారత్ అభివృద్ధి చేసిన నూతన ఏఐ టెక్నాలజీని తొలిసారిగా వాడి విజయం సాధించడం విశేషం.