జమిలికి సై.. బిల్లుకు కేబినెట్​ ఆమోదం

Cabinet approves Jamili Bill

Dec 12, 2024 - 18:46
 0
జమిలికి సై.. బిల్లుకు కేబినెట్​ ఆమోదం

వచ్చే వారమే సభలో బిల్లు
జేపీసీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
రాజ్యాంగంలోని 82 సవరణ
మోదీ నేతృత్వంలో కేబినెట్​ భేటీలో కీలక నిర్ణయం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అత్యంత కీలక బిల్లుకు కేంద్రం జై కొట్టింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం గురువారం నిర్వహించిన కేబినెట్​ లో ‘వన్​ నేషన్​ వన్​ ఎలక్షన్​’ (జమిలి) బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతేగాక వచ్చే వారమే ఈ బిల్లును పార్లమెంట్​ లో ప్రవేశపెట్టాలని కేబినెట్​ నిర్ణయించింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే 2029 నాటికి దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బిల్లుపై వివిధ పార్టీల ప్రతినిధులతో జేపీసీ చర్చించనుంది. సెప్టెంబర్​ లో కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా లోక్​ సభ, రాష్​ర్ట అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ఆమోదం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్​ 82ను సవరించనున్నారు. 

కేంద్ర ప్రభుత్వం వన్​ నేషన్​ వన్​ ఎలక్షన్​ పై మాజీ రాష్ర్టపతి రామ్​ నాథ్​ గోవింద్​ అధ్యక్షతన 2023 సెప్టెంబర్​ 2న ఒక కమిటీ ఏర్పాటు చేసింది. 8మంది సభ్యులతో కూడిన ఈ బృందం దేశంలోని అన్ని వర్గాలు, పార్టీలతో 191 రోజులపాటు సుదీర్ఘంగా చర్చించింది. తుది నివేదికను కమిటీ మార్చి 14న రాష్ర్టపతి ద్రౌపది ముర్మూకు సమర్పించింది. 

కోవింద్​ కమిటీ సూచనలు..
కమిటీ నివేదిక ప్రకారం ఒకే దేశం, ఒకే ఎన్నికలు అమలు చేసేందుకు అనేక రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం తగ్గుతుంది.
2023 చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వాటి పదవీకాలాన్ని పొడిగించొచ్చు. 
న్యాయ కమిషన్ ప్రతిపాదనకు అన్ని పార్టీలు అంగీకరిస్తే ఇది 2029 నుంచి అమలు చేస్తారు. ఇందుకోసం 2026 డిసెంబర్ నాటికి 25 నాటికి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం విషయంలో మిగిలిన ఐదేళ్ల పదవీకాలానికి ఎన్నికలు నిర్వహించవచ్చు.
-రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదించి ఎన్నికల సంఘం లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకే ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులను సిద్ధం చేయవచ్చు.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు పరికరాలు, మ్యాన్ పవర్, భద్రతా బలగాల ముందస్తు ప్రణాళికను కూడా కోవింద్ ప్యానెల్ సిఫార్సు చేసింది.

ఒకేసారి ఎన్నికల నిర్వహణ..
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1952, 1957, 1962, 1967లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1968, 1969లో అనేక రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం ముందుగానే రద్దు చేశారు. 1970లో ఇందిరా గాంధీ లోక్‌సభ ఐదేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే రద్దు చేయాలని సూచించారు. దీంతో భారత్‌లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే సంప్రదాయానికి బ్రేక్‌ పడింది. వాస్తవానికి 1972లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇంత కాలం తరువాత మోదీ ప్రభుత్వం ఈ ప్రయత్నానికి బీజం వేసింది. 

పదవీ కాలాల తగ్గింపు..
-వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలులోకి వస్తే ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రస్తుత పదవీకాలం 3 నుంచి 5 నెలల వరకు తగ్గుతుంది. -గుజరాత్, కర్ణాటక, హిమాచల్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల పదవీకాలం 13 నుంచి 17 నెలలు తగ్గుతుంది. 
-అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి పదవీకాలం తగ్గుతుంది.

ఆమోదం ఎలా?..
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అమలులో రాజ్యాంగాన్ని సవరించడానికి కనీసం 6 బిల్లులు ఉంటాయి. పార్లమెంటులో ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. పార్లమెంటు ఉభయ సభలలో అంటే లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీయే మెజారిటీని కలిగి ఉంది. కానీ, ఏ సభలోనైనా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలి. రాజ్యసభలోని 245 సీట్లలో ఎన్డీయేకు 112 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షాలకు 85 సీట్లు ఉన్నాయి. మూడింట రెండొంతుల మెజారిటీకి ప్రభుత్వానికి కనీసం 164 ఓట్లు అవసరం.  లోక్‌సభలో ఎన్డీయేకు 545 సీట్లకు గాను  292 సీట్లు ఉన్నాయి. లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సంఖ్య 364. కానీ, మెజారిటీ సభ్యులు హాజరైన, ఓటింగ్ పరంగా మాత్రమే లెక్కిస్తారు. ఏది ఏమైనా ఈ బిల్లులను ఉభయ సభల్లో మోదీ ప్రభుత్వం ఎలా ఆమోదింప చేసుకుంటుందనే ఆతృత అందరిలో నెలకొంది. 

సవాళ్లు..
ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి భారత రాజకీయ వ్యవస్థ సమాఖ్య నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థలో ఏకకాల ఎన్నికల ఆచరణాత్మకతపై కూడా న్యాయ కమిషన్ ప్రశ్నలు లేవనెత్తింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే భారీ మొత్తంలో వనరులు అవసరమవుతాయి. ఇందుకోసం ఏర్పాట్ల చేయడం అంటే ఎన్నికల కమిషన్​ కు కూడా కత్తిమీద సాములగానే మారుతుంది. భారీ సంఖ్యలో ఈవీఎంలు, శిక్షణ పొందిన అధికారులు ఉంటేనే ప్రక్రియను సజావుగా నిర్వహించగలుగుతారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.