సుప్రీంలో టీఎంసీకి చుక్కెదురు సీబీఐకి షాజహాన్ అప్పగింత
ఎట్టకేలకు కలకత్తా హైకోర్టు ఆదేశాలతో 26 గంటల తరువాత సందేశ్ ఖాళీ నిందితుడు షాజహాన్ షేక్ ను పోలీసులు సీబీఐకి విచారణ కోసం అప్పగించారు.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎట్టకేలకు కలకత్తా హైకోర్టు ఆదేశాలతో 26 గంటల తరువాత సందేశ్ ఖాళీ నిందితుడు షాజహాన్ షేక్ ను పోలీసులు సీబీఐకి విచారణ కోసం అప్పగించారు. బుధవారం సాయంత్రం 3.45 గంటలకు సీబీఐ బృందం పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకోగా 6.30 గంటలకు నిందితుడిని అప్పగించారు. షాజహాన్ ను సీబీఐ కస్టడీలోకి తీసుకోగానే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుప్రీంకోర్టులో సందేశ్ ఖాళీ కేసును తక్షణ విచారణపై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా తెలిపారు. కలకత్తా కోర్టు ఆదేశాల మేరకు బుధవారం నాలుగు గంటల వరకు నిందితుడు షాజహాన్ షేక్ ను సీబీఐకి అప్పగించాల్సి ఉంది. దీన్ని విభేదిస్తూ టీఎంసీ సర్కార్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ బృందంపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐపై నిషేధం విధించాలని బెంగాల్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. దీనిపై సిట్ దర్యాప్తు చేస్తోందని బెంగాల్ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. మీ దరఖాస్తును సీజేఐకి పంపుతున్నామని, పిటిషన్ లిస్టింగ్‌పై ఆయన నిర్ణయం తీసుకుంటారని బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. జనవరి 5న టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలు చేసేందుకు ఈడి బృందం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీకి చేరుకుంది. ఈ సమయంలో, షేక్ మద్దతుదారులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు అధికారులు గాయపడ్డారు.