వ్యవసాయ హబ్ గా భారత్
రైతుల ఆర్థిక బలోపేతమే లక్ష్యం అత్యధిక దిగుబడుల్లో మహిళా శక్తి పాత్ర కీలకం కిసాన్ సమ్మాన్ నిధి విడుదలలో ప్రధాని మోదీ
వారణాసి: నూతన పోకడలతో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని వ్యవసాయ హబ్ గా మార్చాలన్నదే తమ సంకల్పమన్నారు. దీని ద్వారా ప్రపంచంలోని ప్రతీ ఇంటా భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులు ఉండాలని ఆకాంక్షించారు. మెరుగైన పంటలు పండించడం ద్వారా ప్రపంచ మార్కెట్ లో భారత వ్యవసాయాన్ని మరింత వృద్ధి దిశలో కొనసాగించవచ్చని, అదే సమయంలో రైతులను ఆర్థికంగా పూర్తి బలోపేతం చేయవచ్చని మోదీ తెలిపారు. సహజ వ్యవసాయం, ఔషధ గుణాల పంటలు, తృణధాన్యాలు, కూరగాయల సాగు, పండ్లు తదితర పంటల అధిక దిగుబడి సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. వ్యవసాయ రంగంలో మహిళా శక్తి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వ్యవసాయానికి కొత్త దిశానిర్దేశం చేయడంలో అక్కా, చెల్లెళ్ల పాత్ర విస్తరించడం అభినందనీయమని ప్రధాని నమోదీ పేర్కొన్నారు.
రైతుల ఖాతాల్లో రూ. 20వేల కోట్లు విడుదల..
మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని తొలిసారిగా వారణాసిలో మంగళవారం పర్యటించారు. ఇక్కడి నుంచి 9.36 కోట్ల మంది రైతులకు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ 17వ విడత నిధులు రూ. 20వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. 30వేల మందికి పైగా మహిళా స్వయం సహాయక బృందాలకు కృషి సఖి సర్టిఫికెట్లను అందజేశారు.
ప్రపంచంలో అతిపెద్ద నగదు బదిలీ..
అనంతరం ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. కిసాన్ సమ్మాన్ నిధి ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకంగా నిలుస్తోందన్నారు. దేశంలోని కోట్లాది మంది రైతులకు ఇప్పటివరకు రూ. 3.15 లక్షల కోట్లను వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేశామని నమోదీ తెలిపారు. కేవలం వారణాసి జిల్లాలోనే రైతులకు రూ. 700 కోట్లు అందించామని తెలిపారు.
డిజిటల్ ఇండియాలో మహిళల పాత్ర కీలకం..
మహిళా స్వయం సహాయక బృందాలు కృషి సఖి డిజిటల్ ఇండియా తయారీలో మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుతం ఈ పథకం 12 రాష్ట్రాల్లో కొనసాగుతోందని రానున్న సమయంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మూడు కోట్లమందిని లఖపతి దీదీలుగా తీర్చిదిద్దుతామన్నారు.
దేశచరిత్ర పునరావృతం.. అతిపెద్ద ప్రజాస్వామ్య విజయం..
60 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను దేశ ప్రజలు పునరావృతం చేశారని ప్రధాని మోదీ అన్నారు. మూడుసార్లు బీజేపీకి విజయాన్ని అందించారని తెలిపారు. మరోమారు సేవకుడుగా దేశ ప్రజలకు సేవలందించడం తన అదృష్టమని పేర్కొన్నారు. దేశంలో 64 కోట్ల మందికిపైగా ఓట్లు వేసి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని నిరూపించుకున్నారని కొనియాడారు. ప్రజాస్వామ్య మూలాలను బలంగా చాటుకున్నారని తెలిపారు. మరోమారు కాశీ వారణాసి ప్రజలు తనపై నమ్మకం ఉంచి తన విజయానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాశీ విశ్వనాథుడు, గంగాదేవి ఆశీస్సులతో మూడోసారి సేవ చేసే భాగ్యం లభించడం తన అదృష్టమని ప్రధాని మోదీ అన్నారు.
ప్రస్తుతం జీ–7 దేశాల్లోని ఓటర్ల సంఖ్య కంటే భారత్ లోని ఓటర్ల సంఖ్య ఒకటిన్నర రెట్లు ఎక్కువని ప్రధాని తెలిపారు.