మోదీతో సుల్తాన్ హసనల్ బోల్కియా భేటీ
కీలక ఒప్పందాలపై సంతకాలు
బ్రూనై స్వాగతం, ఆతిథ్యం మరువలేనివి
త్వరలో చెన్నై నుంచి బ్రూనైకు విమాన సర్వీసులు
బందర్ సేరి బెగావా: ప్రధాని మోదీ, బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించారు. బుధవారం ఇరువురి మధ్య ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ లో భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీని మరింత బలోపేతం దిశగా చర్చలు ఫలప్రదమైనట్లు మోదీ తెలిపారు.
ఇరుదేశాల మధ్య చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. బ్రూనై 40వ వార్షికోత్సవంపై 140 కోట్ల భారతీయులు, తన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయాణంలో బ్రూనై అభివృద్ధి అభినందనీయమన్నారు. తనకు ఇక్కడ లభించిన స్వాగతం, ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు. ఇందుకు సుల్తాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇరుదేశాల్లో 2030 విజన్ పై చర్చించామన్నారు. భారత్–బ్రూనై సాంస్కృతిక, వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు ఫలప్రదమైనట్లు పేర్కొన్నారు. ఆర్థిక, వైజ్ఞానిక, రక్షణ, అంతరిక్ష, పరిశ్రమలు, ఫార్మా, వైద్య, సైబర్ సెక్యూరిటీ, నిరుద్యోగం, ఉపాధి కల్పన లాంటి విషయాలపై సుదీర్ఘంగా చర్చించి ఒప్పందాలు చేసుకున్నామన్నారు. చర్చలు ఫలప్రదం అవ్వడంలో భారత్ కు సహకరించిన సుల్తాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. యాక్ట్ ఈస్ట్, ఇండో పసిఫిక్ విజన్ లో బ్రూనై సహకారం మరువలేనిదని ప్రధాని పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలు భవిష్యత్ లో నూతనాధ్యాయాన్ని లిఖిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే చెన్నై నుంచి నేరుగా బందర్ సేరీకి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని ఒప్పందం కుదిరిందన్నారు.
బ్రూనై సుల్తాన్ భారత్ లో పర్యటించాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇందుకు సుల్తాన్ హసనల్ బోల్కియా సానుకూలంగా స్పందించారు.
ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్..
ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియాలు కలిసి ఈ ప్యాలెస్ బ్రూనైలోనే అత్యంత ఖరీదైనది. ఈ ప్యాలెస్ కు అనేక ప్రత్యేకతలున్నాయి. 22 క్యారెట్ల బంగారంతో చేసిన అలంకరణ, ఐదు స్విమ్మింగ్ పూళ్లు, 1700 బెడ్ రూమ్లు, 257 బాత్ రూమ్ లు ఉన్నాయి. 110 వాహన గ్యారేజీలు, బెంగాల్ పులులు, విభిన్న పక్షి జాతులు ఉన్నాయి. ఈ ప్యాలెట్ ఆవరణలో ఒక చిన్నపాటి జూపార్క్ నే నిర్మించారు. ఈ ప్యాలెస్ లో ఒకేసారి ఐదువేల మంది అతిథులకు వసతి కల్పించే సౌకర్యాలున్నాయి.