Congress: కాళ్ల కింద ఇసుక కదులుతున్నట్టుంది!
In Telangana, the Congress party is automatically shrinking
హనీమూన్ కాలం ముగిసినా... ఆ మత్తు నుంచి తెలంగాణ కాంగ్రెస్ బయటపడినట్టు లేదు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్నా, టీపీసీసీ నాయకత్వం ఇంకా శాసనసభ ఎన్నికల గెలుపు మత్తులోనే జోగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం పరిస్థితి తలా తోకా లేని వ్యవహారంలా తయారైంది. ‘‘విజయానికి తండ్రులెక్కువ... పరాజిత పటాలానికి సైన్యాధ్యక్షుడిగా ఎవరూ ఉండర’’ని లోకనీతి! విజయం మత్తు నెత్తికెక్కి కొన్ని విపరీత చేష్టలకు పాల్పడటం, నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం, తెలిసీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటి పరిణామాల వల్ల ప్రజాక్షేత్రంలో పార్టీ ప్రభావం నెమ్మదిగా క్షీణిస్తోంది. నెల రోజుల కింద సానుకూలంగా కనిపించిన వాతావరణాన్ని కాంగ్రెస్ చేజేతులా చెడగొట్టుకుంటున్న జాడలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక గెలుస్తుందని భావిస్తున్న స్థానాల సంఖ్య ఇదివరకటి కన్నా తగ్గినట్టు జనక్షేత్రం నుంచి ప్రాథమిక సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణుల్లోనూ కొంత నిరాసక్తత ఆవహిస్తున్న జాడలు పోలింగ్ ముంగిట్లో పొడసూపుతున్నాయి. పార్టీ నాయకత్వం ఆశిస్తున్న డబుల్ డిజిట్ స్థానాలు వస్తాయా? అనే మీమాంస అప్పుడే మొదలైంది. వెంటనే పరిస్థితుల్ని చక్కదిద్దుకోకుంటే పుణ్యకాలం కాస్తా ‘చేయి’జారటం ఖాయమనే భావన పార్టీ లోపలా – బయటా వ్యక్తమౌతోంది. ఎందుకీ పరిస్థితి? అన్నది ప్రధాన ప్రశ్న.
ఎంత చేసినా కాంగ్రెస్ ప్రచారం ఊపందుకోవటం లేదు. ముఖ్యమంత్రిగానే కాకుండా ఇంకా టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి స్వయంగా ఎంపీల నామినేషన్ ఘట్టాలకు వెళుతున్నారు. అలా వెళ్లాల్సిన దీన పరిస్థితి వచ్చిందా పార్టీకి? అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. చచ్చిన పాములాంటి బీఆర్‌ఎస్‌ని సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులు ఇంకా ముక్క తిట్లు తిడుతూనే ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే తీరుతామని గట్టిగానే చెబుతున్నారు. మిగిలిపోయిన వాటిని ఈ ఎన్నికల తర్వాత, ఆగస్టులో నెరవేరుస్తామని మాటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే తామిచ్చిన ఆరు హామీలు అమలవుతాయన్నట్టు సీఎం చెప్పిన మాటలు కొంత బెడిసి కొట్టడంతో.. ఖంగుతిని, వెనువెంటనే కాసింత సర్దుకున్నారు. కానీ, మళ్లీ నోరుజారి..‘ఇదుగో! మా ఆడవాళ్లందరికీ తెలుసు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఉచిత బస్సు సదుపాయం ఇక ఉండబోద’ని చెబుతూ ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు మళ్లీ వివాదాస్పదం అయ్యాయి. ముందు ఏ షరతూ లేకుండా హామీ ఇచ్చి, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు– ఫలితాలకు దాన్ని లింకు పెట్టి, హామీలను సందేహంలో పడేయటమేమిటని జనం నిందిస్తున్నారు.
వారి తప్పులే వీరూ చేసి...
కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారిని, కనీసం రాజీనామా చేయించకుండా తమ పార్టీలో చేర్చుకోవడమేమిటని బీఆర్‌ఎస్ పాలకపక్షంగా ఉన్నపుడు కాంగ్రెస్ నాయకులు నిందించారు. అదే తీరులో ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో ఎన్నికైన వారిని, తాజా ఎన్నికల్లో పోటీకి అక్కడ ‘బీ’ ఫామ్ ఖరారైన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం, ఏకంగా తమ అభ్యర్థులుగా ప్రకటించుకోవడం ఏమిటనే విమర్శ వస్తోంది. రోజుల ముందు ఇతర పార్టీల నుంచి వలసవచ్చిన వారికి బీఆర్‌ఎస్, బీజేపీలు టిక్కెట్లు ఇస్తే.. ‘అరువు అభ్యర్థులతో పోటీ చేస్తున్నార’ని కాంగ్రెస్ విమర్శించేది. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేయడాన్ని విడ్డూరంగా చూస్తున్నారందరు. తాము విమర్శించిన ఆయా పార్టీల చేదు అనుభవాల నుంచి కాంగ్రెస్ ఏ గుణపాఠం నేర్వలేదనే స్పష్టమౌతోంది. ఈ వైఖరితో.. ఇన్నాళ్లూ పార్టీనే అంటిపెట్టుకొని, మంచి – చెడు కాలాల్లోనూ కాంగ్రెస్‌కు అండగా ఉన్న తమను కాదని బయటి నుంచి వచ్చిన వారికే రాత్రికి రాత్రి టిక్కెట్లు ఇవ్వడమేమిటని పార్టీ పాత నాయకులు ప్రశ్నిస్తున్నారు. దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్ రెడ్డి, సునీత మహేందర్‌రెడ్డి వంటి వారిని పార్టీలో చేర్చుకొని అభ్యర్థులు చేయడాన్ని వారుదహరిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక, ‘ఈ ప్రభుత్వం నిలువదు’ అని మొదట తిట్టిందే కడియం శ్రీహరి. చేవెళ్ల నియోజకవర్గం నుంచి జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డిని పార్టీలో ముందు చేర్చుకొని, చేవెళ్ల సీటు ఆమెకే అన్న భావన కలిగించింది నాయకత్వం. తర్వాత సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి(బీఆర్‌ఎస్)ని చేర్చుకోవడం కొత్త సమస్యలకు కారణమైంది. ఇదొక వ్యూహపరమైన తప్పిదంగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాజకీయ లబ్ధికోసం తీసుకున్నప్పుడు, సునీతా మహేందర్‌రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిని చేసి, రంజిత్‌రెడ్డిని మల్కాజిగిరి అభ్యర్థిగా మార్చి ఉంటే.. రెండు చోట్ల కాంగ్రెస్ పరిస్థితి ఇంకింత మెరుగ్గా ఉండేదనే భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. సరైన రాజకీయ సమీక్ష లేకుండా ఎవరిని బడితే వారిని పార్టీలో చేర్చుకోవడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏంటనే ప్రశ్నను రేకెత్తిస్తున్నారు. కేశవరావు, నాగేందర్ లాంటి వాళ్లను తిరిగి పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఒరిగే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది.
పీసీసీకి తొందర లేదు, పదవులకేనా?
ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా కొనసాగుతున్నారు. ఏక కాలంలో రెండు బాధ్యతల నిర్వహణ కొంత క్లిష్టమే! ఏఐసీసీ నాయకత్వమైనా చొరవ తీసుకొని రాష్ట్ర నాయకత్వాన్ని మార్చుకొని ఉండాల్సింది. ఆ పని చేయలేదు. వ్యవస్థాపరమైన లోపం కొట్టచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ ఉనికి కన్నా అన్నింటా.. ప్రభుత్వ ముద్రే ప్రజల మెదళ్లలో నాటుకుంటోంది. పార్టీ అధ్యక్షుడిని కూడా టీపీసీసీ నేతగా కన్నా ప్రభుత్వాధినేత– సీఎం గానే పౌరులు భావిస్తున్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మి, సదరు విశ్వాసంతోనే పార్టీకి పట్టం కట్టారు’ అనుకుంటున్నప్పుడు, హామీల అమలును బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి పార్టీ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన సమయమిది. ముఖ్యంగా ఇది ఎన్నికల కాలం.. కానీ, పార్టీ అలా లేదు. టీపీసీసీ కార్యవర్గం ఎక్కడా కనిపించదు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కాంగెస్ర్ ఎన్నికల ప్రచారం అంతంతగానే ఉండటానికి అదీ ఒక కారణం కావచ్చు. సాధారణంగా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక స్వల్ప వ్యవధిలోనే లోక్‌సభకో, స్థానిక సంస్థలకో ఎన్నికలుంటే.. అంత తొందరగా నామినేటెడ్ పదవుల జోలికి వెళ్లరు. తాజా ఎన్నికల్లో బాగా పనిచేయాలని అందరికీ బాధ్యత ఇచ్చి, అవి ముగిశాకే సదరు పదవుల పందేరం ఉంటుంది. పార్టీలకతీతంగా మాజీ ముఖ్యమంత్రుల్లో.. ఒక్క చంద్రబాబునాయుడనే కాకుండా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, కే.చంద్రశేఖరరావులు కూడా అదే చేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ మాత్రం ఎన్నికల ముంగిట్లో అందుకు సిద్దపడింది. కోడ్ వల్ల అధికారిక ప్రకటన ఆగిందే తప్ప జాబితా అప్పటికే సిద్దమైపోయినట్టు సమాచారం. వివిధ కార్పొరేషన్లకు ఖరారైన నామినేటెడ్ పోస్టుల జాబితాలోని పేర్లు బయటకు పొక్కాయి. తమకు ఏ పదవీ రావట్లేదని తెలిసిపోయిన వారు ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పనిచేస్తారా? అన్నది సందేహమే!
అలసత్వమా? అయోమయమా!
కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందన్న భరోసా ఉన్న ఖమ్మంలో, పార్టీ గెలుపు అసంభవం అనుకుంటున్న హైదరాబాద్‌లో.. రెండు చోట్లా పార్టీ అభ్యర్థులు ఎవరో ఇంకా ఖరారు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది, అయినా ఎందుకీ జాప్యమో అర్థం కాదు. కులాల సమీకరణాల్లో ఖమ్మం అభ్యర్థిత్వం ఆగిందనే ప్రచారమైతే ఉంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉండాలో.. ఓ కొత్త మిత్రపక్షం నేత ఖరారు చేస్తారేమో? అందుకే ఈ నిరీక్షణ అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కరీంనగర్ మరీ ఘోరం. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ దాదాపు నాలుగు నెలల కింద అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నుంచీ తమ ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటికీ అభ్యర్థి ఎవరో తేల్చలేదు. అయినా, అధికారికంగా ఆయన పేరు ఖరారు కాకున్నా, ‘బీ’ఫామ్ జారీ చేయకున్నా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేస్తుంటే ఆయనకు మద్దతుగా ఓ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లడం, తగుదునమ్మా అని ఫొటోలు దిగడం చిత్రంగా ఉంది. ఆయనే మన అభ్యర్థి అని పార్టీ నాయకత్వం రహస్యంగా వారికేమైనా కన్ను గీటి ఉంటుంది. కానీ, సగటు ప్రజలేమనుకుంటారు? కాంగ్రెస్‌కు ఎందుకీ దుస్థితి అనుకుంటారేమో! అనే స్పృహ ఉండొద్దా?
ప్రకృతి సహకారం అవసరం..
కాలం కలిసి వచ్చినా.. ప్రకృతి కూడా సహకరిస్తేనే పాలకపక్షానికి ఎన్నికల్లో సానుకూలత లభించొచ్చు. ఇప్పుడు రేవంత్ ముందు ఉన్న సవాళ్లలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలతోపాటు, రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకొని, బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఆధిపత్యం సాధించాలి. ఈ విషయంలో కాంగ్రెస్ ఏ మాత్రం వెనకబడ్డా... అది బీఆర్‌ఎస్ పునరుజ్జీవనానికో, బీజేపీ నూతన వైభవానికో కాంగ్రెసే దారులు పరిచినట్టవుతుంది. సరిగ్గా ఎన్నికల సమయానికి... రాష్ట్రమంతా ఎండలు మితిమీరటం, తాగునీటి సమస్య, కరువు, రైతు ధాన్యానికి మార్కెట్టు – కొనుగోళ్లు – మద్దతు ధర లభించకపోవడం వంటివి పాలకపక్షానికి ప్రతికూల ప్రభావం చూపొచ్చనే అభిప్రాయం ఉంది. సామాజిక న్యాయం పరంగా చూసినపుడు, కాంగ్రెస్‌లో ఉన్న మూడు స్థానాలూ మాల సామాజికవర్గ అభ్యర్థులకే ఇచ్చారనే అభియోగమొకటుంది. వీటన్నిటినీ ఎలా అధిగమించి, కొత్త విశ్వాసం కల్పిస్తూ ఓటర్లను మచ్ఛిక చేసుకొని ఎన్నికల్లో నెగ్గుకువస్తారనేది పెద్ద ప్రశ్న!
– దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,
Mail: dileepreddy.ic@gmail.com
9949099802