డోర్ డెలివరీ ముసుగులో అదనపు బాదుడు

Door delivery is an added bonus in the guise of delivery

Aug 22, 2024 - 19:26
 0
డోర్ డెలివరీ ముసుగులో అదనపు బాదుడు

ఆరు నెలలు గడుస్తున్నా కానరాని కాంట్రాక్టర్
గ్యాస్ సిలిండర్ల పై దళారుల అధిక వసూళ్లు
రూ.4లకు టెండర్ రూ.40లు బాదుడు
బాదుడుకు బలి అవుతున్న వినియోగదారులు
చూసిచూడనట్లుగా సింగరేణి అధికారులు

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు  చూపెడుతున్నా యి. రామకృష్ణాపూర్ సింగరేణి కార్మికుల నడ్డి విరగొట్టే విధంగా పట్టణంలోని ఇండియన్ గ్యాస్ సిబ్బంది డెలివరీ పేరిట అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒక పక్క గ్యాస్ సిలిండర్ ధర ఇబ్బంది పెడుతున్న తరుణంలో గ్యాస్‌ను డెలివరీ చేసే సమయంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ టెండర్ పొందిన కాంట్రాక్టర్లకు ఒక్కో సిలెండర్ ను వినియోగదారులకు చేరవేసేందుకు సింగరేణి యాజమాన్యం రూ.4 చొప్పున చార్జీ  చేస్తుంది.అ యితే 5 కిలోమీటర్ల వరకు వినియోగదారులకు ఫ్రీ డెలివరీ చేయవలసి ఉంటుంది. రూ.877 ధర ఉన్న గ్యాస్ సిలెండర్ ను వినియోగదారునికి రూ.877 పంపిణీ చేయవలసి ఉండగా డెలివరీ బాయ్స్ మాత్రం రూ.40 అధికంగా చార్జీ చేస్తూ వినియోగదారుని వద్ద నుంచి రూ.900 నుంచి రూ.920 అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. రూల్స్ మాట్లాడితే వినియోగదారుడికి రావాల్సిన సిలిండర్‌ రోజులు ఆలస్యంగా రావడం లేదా వచ్చిన వాహనం దగ్గరకు వెళ్లి తీసుకోవాల్సిన దుస్థితి. ఎవరైనా ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే ఇక గ్యాస్​ సిలీండర్​ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంటి గుమ్మం వరకూ సిలిండర్‌ వస్తే రూ.40 ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సింగరేణి అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు.

కానరాని కాంట్రాక్టర్ ..

కార్మికుల సంక్షేమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం టెండర్ కాంట్రాక్టర్ ద్వారా గ్యాస్ సిలిండర్ ఉన్న ధరకే కార్మికులకు చేరవేస్తుంది. అయితే ఈ టెండర్ గడువు రెండేళ్లు ఉంటుంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి సింగరేణి యాజమాన్యం ఆన్​ లైన్​ టెండర్ల ద్వారా సిలిండర్‌ డెలివరీ కోసం కాంట్రాక్టర్లను టెండర్లకు పిలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త కాంట్రాక్టర్ టెండర్ తీసుకోవాల్సి ఉంది. 

తనిఖీలు లేకపోవడమే కారణం..

జిల్లా పౌరశాఖ అధికారుల తనిఖీలు చేయకపోవడం వల్లే గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. వసూళ్లపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే గ్యాస్ సిలిండర్ తమ ఇంటికి సక్రమంగా పంపిణి చేయకుండా వినియోగదారుడికి చుక్కలు చూపిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు: బ్రాంచ్ మేనేజర్..

కార్మికులకు ఫ్రీగా డెలివరీ చేయవలసిన సిలిండర్ డెలివరీ టెండర్లపై సింగరేణి సూపర్ బజార్ బ్రాంచ్ మేనేజర్ సుదర్శన్ ను వివరణ కోరగా ఇదివరకే రామకృష్ణాపూర్ ఏరియాలో సూపర్ బజార్ గ్యాస్ డెలివరీ టెండర్ ఓ కాంట్రాక్టర్ కు ఇచ్చామన్నారు. కాంట్రాక్టర్ రావడంలో ఆలసత్వం చేస్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వినియోగదారుల వద్ద  డెలివరీ చేసే సమయంలో ఎవరైనా వసూళ్ళకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.