పౌరసత్వం కల్పిస్తే సమస్యేంటీ?
సీఏఏలో జోక్యం చేసుకునే ధైర్యం టీఎంసీకి లేదు ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్ షా
కోల్ కతా: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు పౌరసత్వం కల్పిస్తే సమస్య ఏంటని టీఎంసీని కేంద్రమంత్రి అమిత్ షా నిలదీశారు. టీఎంసీకి సీఏఏలో జోక్యం చేసుకునే సత్తా, ధైర్యం రెండూ లేవని అమిత్ షా పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమ బెంగాల్ లోని మల్దాహాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు.తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటుంటే సందేశ్‌ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. మోదీనే మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 18 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారని ఈసారి మాత్రం ఆ సాంఖ్యను 35కు పెంచాలని కోరారు. అలా చేస్తే ఇక్కడి చొరబాట్లను పూర్తిగా ఆపివేస్తామని మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఓటు బ్యాంకుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న మమతా బెనర్జీ సందేశ్ ఖాళీ మహిళలపై వేధింపులు వచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైకోర్టు జోక్యంతో నిందితుడు జైల్లో ఉన్నాడని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే టీఎంసీ రౌడీలను తలకిందులుగా వేలాడదీస్తామని షా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని అమిత్ షా తెలిపారు. ఆ నిధులన్నీ టీఎంసీ నాయకులు కాజేసి పేదల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. పది సంవత్సరాలకు ముందు సైకిల్ మీద తిరిగే వారికి కార్లు భవంతులు, కోట్ల రూపాయల వ్యాపారాలు ఎక్కడివని ప్రశ్నించారు. ఇదంతా ప్రజల సొమ్మేనన్నారు.