పేర్లు మారిస్తే భారత్ మీదవుతుందా
పిచ్చి చేష్టలు మానండి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు భారత్ హెచ్చరిక కీర్తి, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే సహించేది లేదు అరుణాచల్ ఎన్నికల సభలో తీవ్ర వ్యాఖ్యలు
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లోని పేర్లను మారిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చైనాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. భారతదేశ కీర్తి, ప్రతిష్ఠలు, గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అరుణాచల్ ప్రదేశ్ లోని నంసాయ్ లో జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. పేర్లను మార్చడం వల్ల భారత్ చైనాది అయిపోదన్నారు. చైనా భూభాగాలపై భారత్ కు ఆశ లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అయినా చైనా భూభాగాల పేర్లను భారత్ మార్చాలని నిర్ణయిస్తే అది భారత్ ది అయిపోతుందా? అని ప్రశ్నించారు. పొరుగు దేశాలతో, ప్రపంచ దేశాలతో భారత్ ఎన్నటికీ సత్సంబంధాలనే కోరుకుంటోందని తెలిపారు. అయినా కాదని కాలుదువ్వి భారత్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు తెలిపారని గుర్తు చేశారు. తమ లక్ష్యం ఉగ్రవాదం, కబ్జాలు, అవినీతి, కుటుంబ పాలన కాదన్నారు. రాష్ర్ట, దేశ, ప్రపంచ, సమాజ హితమే తమకు ముఖ్యమని మంత్రి తెలిపారు.
భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ అనేది కేవలం నినాద కాదన్నారు. తమ నిబద్ధత, దేశం, సమాజం, నిరుపేదల పట్ల ఉన్న తమ దక్షాదీక్షితలన్నారు. దేశంలో ఉన్న ఏ ఒక్కరికైనా దేశ అభివృద్దే కాంక్షించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దేశ ప్రజలకు ఏదైనా ఇబ్బందులుంటే భారత్ రాజ్యాంగం వారికి వెల్లడించుకునేందుకు పూర్తి స్వేచ్ఛా స్వాంత్రత్యాలను ఇచ్చిందని అన్నారు. అయినా కొందరు దేశ వ్యతిరేకతకు పాల్పడుతుంటే ఊరుకొని చూస్తూ కూర్చుండే వారం కాదని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రంపై తమ హక్కులను చాటుకునే ప్రయత్నాన్ని చైనా ఇక విరమించుకుంటే మంచిదని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు. ఈ ప్రయత్నాలను తాము గట్టిగా తిరస్కరిస్తున్నామని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.