కచ్చతీవు సమీపంలో మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులు

ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

Apr 9, 2024 - 20:48
 0
కచ్చతీవు సమీపంలో మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులు

చెన్నై: తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు మత్స్యకారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కచ్చతీవు ద్వీపం సమీపంలో తమిళనాడు రామేశ్వరం తంగచిమడంకు చెందిన మకినా, నేతాజీ నగర్​ చెందిన రాజేంద్రన్​, రామేశ్వరానికి చెందిన తంగంగాలు సోమవారం మధ్యాహ్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున వారిపై శ్రీలంక నావికాదళం దాడి చేసింది. సముద్రంలో ఆధునిక సౌకర్యాలు లేక, సాంకేతికత లేక చిన్న బోటులో ఉపాధి చేపల వేట కోసం వెళ్లిన తమవారిపై దాడికి పాల్పడడాన్ని తమిళ నాడు మత్స్యకారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

దాడి కచ్చతీవుకు సమీపంలో జరిగినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా శ్రీలంక నేవి ఇదేవిధంగా దాడులకు పాల్పడి 21 మంది మత్స్యకారులను అరెస్టు చేసింది. రెండు పడవలను సైతం స్వాధీనం చేసుకుంది. 

దాడిపై తమిళనాడు మత్స్యకారుల సంఘం నాయకుడు ఆంటోనీ డొమినిక్​ మాట్లాడుతూ.. సముద్రంలో ఉపాధి లేని కార్మికులపై శ్రీలంక ప్రతాపం చూపడం ఎంతమేరకు సమంజసమన్నారు. ఇరుదేశాల్లో భయానక వాతావరణం సృష్టించడమే శ్రీలంక లక్ష్యమా అని ప్రశ్నించారు. మత్స్యకారుడు రాజేంద్రన్​ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదన్నారు. దుర్భర స్థితిలో ఉన్న శ్రీలంకకు భారత్​ ఎన్నోమార్లు ఆర్థిక, ఆహార సహాయం చేసిందని గుర్తు చేశారు.

ప్రజల కనీస అవసరాలను తీర్చుకోలేని శ్రీలంక నేడు భారత మత్స్యకారులపై దాడులకు పాల్పడడం ఆక్షేపణీయమని తెలిపారు. పెద్ద పెద్ద నాయకులు కూడా అప్పట్లో భారత్​ కాళ్లావేళ్లా పడ్డారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇకముందు ఇలాంటి దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆంటోనీ స్పష్టం చేశారు. దాడులపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వెంటనే కల్పించుకొని మత్స్యకారులను సురక్షితంగా తమిళనాడుకు చేర్చే బాధ్యత వారిపై ఉందని ఆంటోనీ స్పష్టం చేశారు.