25వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం
విశాఖ పోర్టులో బ్రెజిల్నుంచి వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్ ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఆపరేషన్ ఇంటర్‌పోల్ పక్కా సమాచారంతో నిఘా అడ్రస్ ఆధారంగా విచారణ డ్రగ్స్ విలువ ఇప్పుడే చెప్పలేమన్న అధికారులు
విశాఖపట్టణం: విశాఖ సీ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్‌ను గురువారం సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి కంటైనర్ వచ్చింది. డ్రై ఈస్ట్‌తో మిక్స్ చేసి డ్రగ్స్ ను వెయ్యి బ్యాగుల్లో తరలించారు. ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున డ్రగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్ గరుడ పేరుతో సోదాలు నిర్వహించింది. విశాఖలోని ఓ కంపెనీ పేరుతో డ్రగ్స్ వచ్చింది.
ఇంటర్‌పోల్ సమాచారంతో పక్కా నిఘా ఏర్పాటు చేసిన సీబీఐ పోర్టుకు రాగానే సోదాలు సమాచారం నిజం కావడంతో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఇంత పెద్ద యెత్తున డ్రగ్స్‌ను తేవడంలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలపై సీబీఐ, ఇంటర్‌పోల్‌లు ఆరా తీస్తున్నాయి. అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టింది. కాగా ఈ కంటైనర్ బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖపట్టణానికి చెందిన కన్సిగ్నీ పేరుతో వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే డ్రగ్స్‌ను ఇతర పదార్థాలతో కలిపి తీసుకువచ్చారని ఆ పదార్థాల నుంచి డ్రగ్స్‌ను వేరు చేసేందుకు సమయం పడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. డ్రగ్స్ విలువ దాదాపుగా రూ. 7250 కోట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారని కూడా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఏ రకమైన డ్రగ్స్ అని తేలాకే దీని ఆర్థిక విలువపై ఖచ్చితమైన సమాచారం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.