పాక్ కు ఐసీసీ ట్రోఫీ
పీవోకే కు పంపొద్దు పాక్ కు ఆదేశం
భారత జట్టు పాల్గొనడంపై ఇంకా సందిగ్ధత
షెడ్యూల్ ఖరారు చేయని ఐసీసీ
హైబ్రిడ్ మ్యాచ్ ల నిర్వహణకు బీసీసీఐ మొగ్గు
పాక్ లో స్వేచ్ఛగా 26/11 నిందితుడు లఖీ ఉర్ రెహమాన్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పాక్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐసీసీ ట్రోఫిని పాక్ కు పంపింది. ఐసీసీ శుక్రవారం ఈ ట్రోఫిని పంపుతూ ఆక్రమిత కశ్మీర్ కు ఈ ట్రోఫీని పంపొద్దని పాక్ క్రికెట్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది. పాక్ లో జరిగే ట్రోఫికి పాల్గొనేందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఐసీసీకి తమ అభ్యంతరాన్ని తేల్చి చెప్పింది. భారత ప్రభుత్వం పీవోకే కూడా భారత్ లో భాగమనే వాదిస్తుండడంతో ఇక్కడకు ట్రోఫీని పంపొద్దనే ఐసీసీ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ కు ఝలక్ ఇచ్చినట్లయ్యింది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ విషయంపై ఐసీసీ భారత్ కు లేఖ ద్వారా తెలిపింది. భారత్ పాల్గొనే విషయంపై స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చింది. ఒకవేళ ట్రోఫీ భారత్–ఇతర దేశాల మ్యాచ్ లు పాక్ లో కాకుండా వేదిక మార్చే యోచన ఉంటే భారత్ కు ట్రోఫీలో పాల్గొనేందుకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. మరోవైపు ఇంతవరకూ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల కాకపోవడం విశేషం. హైబ్రిడ్ మోడల్ లో భారత్ ఆడేందుకు ఒప్పుకోవడంతో ఐసీసీ దీనిపై ఆలోచన చేయనున్నట్లు స్పష్టం అవుతుంది. అందుకే షెడ్యూల్ విడుదల చేయలేదని భావిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడకుంటే భారీ నష్టం వాటిల్లనుంది. భారత్ తో జరిగే ఏ మ్యాచ్ లు, ట్రోఫీలకైనా అత్యధిక ధరలతో శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుంటుంటాయి. ఒకవేళ భారత్ ఈ ట్రోఫీలో ఆడకుంటే అది ఆటలో పాల్గొననున్న అన్ని జట్లతోపాటు ఆయా క్రికెట్ కంట్రోల్ బోర్డులకూ నష్టం వాటిల్లనుంది.
పాక్ లోనే 26-/11దాడుల నిందితుడు..
మరోవైపు 26/11 ముంబాయి దాడుల సూత్రధారి, లష్కర్ తొయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ-ఉర్-రెహమాన్ లఖ్వీ పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. రావల్పిండి, ఇస్లామాబాద్ తదితర ప్రాంతాల్లోనే గాక ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కూడా అతను చాలాసార్లు కనిపించాడని భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పలుమార్లు అతన్ని భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేసినా పాక్ పట్టించుకోలేదు. అంతర్జాతీయ సమాజం ముందు చర్యలు తీసుకున్నట్లుగా నటిస్తూ ఒకసారి అరెస్టు చేసి ఆ పిమ్మట సాక్ష్యాలు లేవనే సాకుతో విడుదల చేసింది. ఇతను ఇప్పుడు పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.