నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మైనార్టీ హోదా ఉంటుందా? లేదా? అన్నది సుప్రీంకోర్టులోని రెగ్యూలర్ బెంచ్ నిర్ణయించనుంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 1967లో 'అజీజ్ బాషా వర్సెస్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా' కేసులో ఇచ్చిన తన స్వంత నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2006లో అలహాబాద్ హైకోర్టు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని మైనారిటీ సంస్థగా పరిగణించలేదు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2019లో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి పంపింది. విచారణ సందర్భంగా, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న విశ్వవిద్యాలయం మైనారిటీ సంస్థగా క్లెయిమ్ చేయవచ్చా అనే ప్రశ్న తలెత్తింది. ఈ అంశంపై విచారణను పూర్తి చేసిన సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఫిబ్రవరి 1న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. తుది నిర్ణయం కోసం బెంచ్ ఈ అంశాన్ని రెగ్యులర్ బెంచ్‌కు రిఫర్ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నుంచి, చంద్రచూడ్ స్వయంగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జెడి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ సంస్థ హోదాను కొనసాగించడానికి అనుకూలంగా వాదించారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించారు.