బెంగాల్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ప్రిన్సిపాల్ ను ఎందుకు విచారించలేదు అప్పుడే వేరే చోట నియమించారెందుకు? తీవ్రతరమైన వైద్యుల నిరసనలు
కోల్ కతా: ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్య విద్యార్థిని హత్య కేసులో కోల్ కతా హైకోర్టు సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం హత్య కేసుపై దాఖలైన అత్యవసర పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. ఇంతపెద్ద ఘటన జరిగితే ప్రభుత్వం స్పందించి తీరు సరైంది కాదని పేర్కొంది. కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను ఇప్పటివరకూ ఎందుకు విచారించలేదని నిలదీసింది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరో చోట ఆయన్ను ఎందుకు నియమించారన్ని ప్రభుత్వ చర్యలను ఆక్షేపించింది. ఆయన విచారణ జరగకుండానే ఎలా నియమించారని నిలదీసింది.
మరోవైపు ఫోర్డా ఆధ్వర్యంలో చేపట్టిన వైద్యుల నిరసనలు రోజురోజుకు దేశవ్యాప్తంగా తీవ్రమవుతున్నాయి. కోల్ కతా, న్యూ ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పెద్ద యెత్తున ట్రైనీ వైద్యులు విధులను బహిష్కరించి ఆయా ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ప్రిన్సిపాల్ రాజీనామా ఆ వెంటనే నియామకం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలతో ఆయా ఆసుపత్రుల్లో రోగుల సేవలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
కాగా ఈ హత్య కేసులో విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక వేత్తలు ఇలా అనేకమంది పిటిషన్లను దాఖలు చేశారు. వీటన్నింటినీ ఒకే వేదికమీదకు తీసుకువచ్చి చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది.