ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
హై అలర్ట్ ప్రకటించిన ఇరు ప్రభుత్వాలు
జనజీవనం అస్తవ్యస్తం
నా తెలంగాణ, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలుచోట్ల జాతీయ రహదారులపై నీరు చేరుకోవడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నదుల్లో వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా వైపుగా కదులుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండం మధ్య రాత్రి తీరం దాటింది. విశాఖకు ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతోనే రెండు రాష్ట్రాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం, సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 3 వరకు వర్షం హెచ్చరికలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులను ఆదేశించింది.
భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
విజయవాడలో కురిసన భారీ వర్షంతో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. నలుగురు మృతి చెందారు. వనపర్తిలో ఓ పాత ఇళ్లు కూలి తల్లికూతుళ్లు మృతి చెందారు. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, మహాబూబాబాద్, వనపర్తి, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలపై వర్షప్రభావం అత్యధికంగా ఉంది.
నదీ పరివాహాక ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. వారిని షెల్టర్ హోమ్ లకు చేర్చారు. రాత్రి షెల్టర్ లో ఆశ్రయం పొందుతున్న వారిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించి ధైర్యం చెప్పారు. షెల్టర్ హోమ్ లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
విద్యుత్ సిబ్బందికి సెలవులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని పేర్కొంది.