బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కుట్రలు బీజేపీ విజయాన్ని ఆపలేవు

రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు: కిషన్​ రెడ్డి – నాంపల్లి నియోజకవర్గ ప్రచారంలో కేంద్ర మంత్రి

Apr 26, 2024 - 16:21
 0
బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కుట్రలు బీజేపీ విజయాన్ని ఆపలేవు
నా తెలంగాణ, హైదరాబాద్​: బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఎన్ని కుట్రలు చేసినా.. బీజేపీ విజయాన్ని ఆపలేవని కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయమని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​ లోక్​ సభ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మాట్లాడారు.‘‘బీఆర్​ఎస్​ పార్టీ గత పదేండ్లలో పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్​ సర్కారు విఫలమైంది. డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు, కొత్త రేషన్​ కార్డులు, పింఛన్లు ఇలా.. అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది. అందుకే బీఆర్​ఎస్​ పార్టీకి ప్రజలు తమ ఓటు ద్వారా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీ అదే బాటలో నడుస్తున్నది”అని కిషన్​ రెడ్డి తెలిపారు.
గ్యారంటీలతో కాంగ్రెస్​ మోసం..

ఆరు గ్యారంటీలతోపాటు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్​ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని సంతకం చేసి మరీ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా.. గ్యారంటీలు అమలు కాలేదు. కొత్త పెన్షన్లు లేవు, పెన్షన్ల పెంపు చేయలేదు. కొత్త రేషన్​ కార్డులు ఇవ్వలేదు. మహిళలకు రూ.2500 చొప్పున ఇవ్వలేదు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, రూ.500 బోనస్​ హామీలన్నీ ఎగ్గొట్టింది కాంగ్రెస్​. అందుకే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్​ కు ఓటు వేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఆపలేరు”అని కిషన్​ రెడ్డి అన్నారు.
మెజార్టీ సీట్లు సాధిస్తం..
తెలంగాణలో పేద ప్రజలు, మహిళలు, యువత, రైతులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్​ రెడ్డి తెలిపారు.‘‘రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించబోతున్నది. మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారు. వికసిత్​ భారత్​ సంకల్పంతో దేశాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకువెళ్లనున్నారు. గత పదేండ్ల మోదీ పాలనలో అభివృద్ధి, దేశ రక్షణ, ఆర్థికా అభివృద్ధి, శాంతి భద్రతలను ప్రజలు ఒకసారి పరిశీలించి మోదీ నాయకత్వాన్ని బలపర్చండి. సికింద్రాబాద్​ ఎంపీగా మరోసారి నన్ను ఆశీర్వదించండి”అని కిషన్​ రెడ్డి కోరారు.
నాంపల్లిలో ఆఫీసు ప్రారంభం

ఈ సందర్భంగా నాంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. బూత్​ స్థాయి నుంచే పార్టీ గెలుపు కోసం ప్రణాళికలు రచించి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.