మోదీ వల్లే వృద్ధి
ప్రతికూల పరిస్థితుల్లోనూ సమయస్ఫూర్తితో నిర్ణయాలు మోదీ దూరదృష్టి, దార్శనికతపై హర్షం సీనియర్ అమెరికా ఎంపీ బ్రాడ్ షెర్మాన్
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్ అంచంచల వృద్ధిని సాధిస్తోందని అమెరికా ఎంపీ బ్రాడ్ షెర్మాన్ కొనియాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మోదీ సమయస్ఫూర్తి నిర్ణయాలతో అభివృద్ధిని సాధించడంలో సఫలమవుతోందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ విదేశాంగ నీతి, అభివృద్ధి, దౌత్య బంధాలపై హర్షం వ్యక్తం చేశారు. మోదీ హయాంలో భారత్–అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు. ఓ వైపు అమెరికా–రష్యా బంధాల్లో పొరపొచ్చాలొస్తున్నా, అంతర్జాతీయ ఒప్పందాలపై భారత్ ఆచీతూచీ అడుగులేస్తుండడం వల్ల భారత్ ప్రపంచదేశాలన్నింటితోనూ సత్సంబంధాలను కొనసాగించగలుగుతోందని ప్రశంసించారు. దీనికంతటికి ప్రధాని మోదీ దార్శనికత, దూరదృష్టియే కారణమని పేర్కొన్నారు. 2014 నుంచి కూడా భారత్ క్రమేణా వృద్ధిని సాధిస్తూ 2024లో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే మోదీ దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రపంచదేశాల మధ్య అనేక సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎదురవుతున్నా భారత్ సునాయాసంగానే వాటికి పరిష్కార మార్గాలు వెతకుతూ ముందుకు వెళ్లడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు సవాళ్లు, సమస్యలు ఉంటాయన్నారు. కానీ వాటిని విజయవంతంగా ఎదుర్కొని ప్రగతి పథంలో నిలిచినప్పుడే నిజమైన నాయకుడి లక్షణం ఏంటో ప్రస్ఫూటమవుతుందని బ్రాడ్ షెర్మాన్ పేర్కొన్నారు. ఆ సత్తా మోదీకి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సువిశాల భారత్ లో ఇంత పెద్ద విజయాన్ని సాధించడం మామూలు విషయం ఏమీ కాదన్నారు.
అమెరికాలో ఉన్న భారతీయ అమెరికన్లు అత్యంత విద్యావంతులు నిజాయితీ పరులన్నారు. అందుకే ఇక్కడ వారు అత్యధిక ఆదాయం పొందగలుగుతున్నారని పేర్కొన్నారు. భారతీయుల మేథోశక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ప్రగతి పథంలో నడిచేందుకు భారతీయులు ఎప్పుడూ ముందువరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదన్నారు.
రష్యా, ఉక్రెయిన్ బంధాల వల్ల అనేక దేశాల మధ్య వైషమ్యాలు, వైరుధ్యాలు ఏర్పడ్డాయన్నారు. ఇరుదేశాల మధ్య భారత్ సయోధ్య కుదిర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇప్పటికీ వదలకపోవడం అభినందనీయమన్నారు. లాస్ ఏంజెల్స్ లోనూ భారత కాన్సులేట్ ను తెరవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బ్రాడ్ షెర్మాన్ కోరారు.