మంకిపాక్స్​ పై ప్రభుత్వం అప్రమత్తం

ఉన్నతాధికారులతో మంత్రి జేపీ నడ్డా సమావేశం

Aug 17, 2024 - 20:52
 0
మంకిపాక్స్​ పై ప్రభుత్వం అప్రమత్తం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మంకిపాక్స్​ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, దేశంలో ఇంతవరకూ ఈ రకమైన కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. శనివారం ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మంకిపాక్స్​ ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో విజృంభిస్తోంది. మరోవైపు డబ్ల్యూ హెచ్​ వో కూడా ఈ వ్యాధిపై పలు దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా సమావేశంలో కీలక విషయాలపై చర్చించారు. 

మంకిపాక్స్​ అరికట్టేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద ఈ వ్యాధిపై పరీక్షలు నిర్వహించాలన్నారు. మరోవైపు ప్రయోగశాలల్లో వ్యాధికారక మందులను సిద్ధం చేయడంపై దృష్టి సారించాలని తెలిపారు.  

మంకిపాక్స్​ సోకిన రోగులు 2 నుంచి 4 వారాలపాటు క్వారంటైన్​ లోకి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఈ వ్యాధి సంక్రమణను తగ్గించవచ్చు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి వైద్యుల పర్యవేక్షణలో మందుల ద్వారా కోలుకుంటాడు, ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు. ఈ వ్యాధి సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం, రోగి వాడిన వస్తువుల ద్వారా మంకిపాక్స్​ సోకుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.