మెడికో హత్య టీఎంసీ పతనం తప్పదు
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సుకాంత మజుందార్
కోల్ కతా: కోల్ కతా మెడికో హత్య కేసులో మమత ప్రభుత్వం పతనం తప్పదని పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు. అత్యాచార ఘటనపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హత్యపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలున్నాయన్నారు. ఈ అత్యాచారం, హత్య విషయంలో మమత ప్రభుత్వం ద్వంద్వ విధానాలను పాటించిందని ఆరోపించారు. టీఎంసీ హస్తం కూడా ఉండే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రిన్సిపాల్ తొలుత చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత మాట మార్చడం, కళాశాలకు రాజీనామా, ఆ తరువాత నియామకం, ఆసుపత్రిపై దాడి ఇలా అన్ని విషయాలపై అనేక సందేహాలు నెలకొన్నాయన్నారు. ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసేందుకు కోర్టు సీబీఐ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిందన్నారు. ఆలస్యమైనా నిజాలు నిగ్గు తేలుతాయన్నారు. మాజీ ప్రిన్సిపల్ టీఎంసీకి అత్యంత దగ్గరి వాడైనందునే అతనికి కళాశాల నిర్ణయాల్లో అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ఒక గ్యాంగ్ నే మెయింటెన్ చేసే స్థాయికి ఎదిగాడంటే అతను ఎవరి ప్రోద్భలంతో చేశాడని ప్రశ్నించారు. ఆయా విషయాలకు త్వరలోనే సమాధానం లభిస్తుందన్నారు. ఏది ఏమైనా ఈ హత్య కేసులో మమత ప్రభుత్వం పతనం ఖాయమన్నారు.
వైద్య విద్యార్థి సంఘాల ఆందోళన, నిరసనలకు బీజేపీ పూర్తి మద్ధతు ఇస్తోందన్నారు. నిజానిజాలను వెలికితీసే వరకు వదలబోమన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మజుందార్ తెలిపారు.