వైద్యుల భద్రతకు కమిటీ

దాడులు దురదృష్టకరం ఆందోళన విరమించాలి ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా

Aug 17, 2024 - 20:39
 0
వైద్యుల భద్రతకు కమిటీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వైద్యుల భద్రతకు అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. వైద్యుల భద్రత కోసం నిపుణుల నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచించిన విధంగా భద్రత కల్పిస్తామని తెలిపారు. ఈ కమిటీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి పటిష్ఠ భద్రతపై కేంద్రానికి నివేదిక అందిస్తుందని తెలిపారు.

ఇటీవల వైద్యులపై జరుగుతున్న దాడులు దురదృష్టకరమని నడ్డా పేర్కొన్నారు. ఫోర్డా, ఐఎంఎ, పలువురు వైద్య బృందం న్యూ ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జేపీ నడ్డాతో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెడికో హత్య, వైద్యులపై వరుస దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని కోరారు. అదే సమయంలో వైద్యులపై దాడులను నిరోధించేందుకు పకడ్భందీ చర్యలు తీసుకోవాలన్నారు. 

వైద్య సంఘాల డిమాండ్లను విన్న మంత్రి జేపీ నడ్డా వారి భద్రతకు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వైద్యులపై దాడి అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాధ్యమైనంత త్వరగా నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రముఖ ఆసుపత్రుల వద్ద భద్రత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో వైద్యులు చేస్తున్న ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మానవతా దృక్పథంతో ఆలోచించాలని వైద్య సంఘాలను కోరారు.