భారత్ పై నేరుగా ప్రభావం
చౌబహార్ పోర్టుపై ఆందోళన
మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఆలస్యం?
ఎర్రసముద్రంలో హౌతీల బెడద
ఇరుదేశాలతో బంధాలు భారత్ కు కీలకమే
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మధ్య ప్రాచ్యం దేశాల్లో ఉద్రిక్తతలు భారత్ పైనే గాకుండా ప్రపంచదేశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. భారత్ నిర్వహిస్తున్న కీలకమైన ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశం ఉండదు. మరోవైపు ప్రపంచంలో 20 శాతం చమురు ఇరాన్ సరఫరా చేస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఈ చమురు డిపోలపై దాడులకు గనుక పాల్పడితే ఇరాన్ ఆర్థికంగా దెబ్బతినడంతోపాటు ప్రపంచదేశాలకు చమురు సరఫరా నిలిచిపోతుంది. దీంతో ప్రపంచదేశాలతోపాటు భారత్ కు ఇది తీవ్ర నష్టాన్నే కలుగజేస్తోంది. భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయగలుగుతుంది. అదే సమయంలో ఇరాన్ నుంచి చమురు సరఫరా నిలిచిపోతే ఆ చమురును రష్యా ఇవ్వగలుగుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఈ పరిణామాలు భారత్ కే గాక సౌదీ అరేబియా, ఖతర్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికాను కూడా తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
ఈ దేశాలన్నింటితో భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టే మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది దీని ద్వారా వస్తు రవాణా మరింత సులభతరం అవుతుంది. వాణిజ్య, వ్యాపారాల్లో పెరుగుదల నమోదవుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపైనే అన్నిదేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇదే గనుక ఆలస్యం అయితే ఈ నష్టం భారీగానే ఉండనుంది.
మరోవైపు ఇరాన్ లోని చౌబహార్ పోర్టు భారత్ కు అత్యంత కీలకమైనది ఈ పోర్టు ద్వారానే చమురు నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. గతంలో ఈ పోర్టు ఓసారి మూతపడింది. దీనివల్ల భారత్ కు నష్టం కూడా చేకూరింది. ఒకవేళ ఇజ్రాయెల్ ఈ పోర్టుపై దాడి చేస్తే పలు దేశాలకు చమురు రవాణా పూర్తిగా నిలిచిపోతుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ ల శత్రుత్వం కొత్తదేం కానప్పటికీ ఇరాన్ మంగళవారం అర్థరాత్రి ప్రయోగించిన బాంబులతో నేరుగా ఇజ్రాయెల్ తో తలపడినట్లయ్యింది. ఇదే ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణమైంది. దీనికి బదులు తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఏకంగా ఐక్యరాజ్య సమితి అగ్రనాయకులపై కూడా నిప్పులు చెరిగింది. దీంతో ఇజ్రాయెల్ ఎవ్వరి మాట వినదనేది స్పష్టం అవుతోంది.
మరోవైపు భారత్ కు ఇరాన్–ఇజ్రాయెల్ లు రెండూ మిత్రదేశాలే. ఈ నేపథ్యంలో యుద్ధ పరిస్థితుల్లో ఆయా దేశాలు మిత్రదేశాల వాదనలను పక్కన పెట్టే ఆస్కారం కూడా లేకపోలేదు.
భారత్ లో మంగళవారం ఐదుశాతం చమురు ధరలు పెరిగి 74.40 డాలర్లకు చేరుకుంది. దీంతో ఈ భారమంతా ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సామాన్యుడి నుంచే రాబట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు రవాణా ఖర్చులు, నిత్యావసరాలు, ప్రయాణాలు మరింత ప్రియం కానున్నాయి. ఈ రెండు దేశాల్లో యుద్ధవాతావరణమే గాక ఎర్ర సముద్రం ద్వారా రవాణాకు హౌతీ ఉగ్రవాదులు ప్రతిబంధకంగా మారడం కూడా భారత్ కు నష్టాన్ని చేకూరుస్తుంది.
ఇజ్రాయెల్ సాంకేతికత, ఆయుధాలను భారత్ కు అందజేస్తూ తన మిత్రత్వాన్ని కొనసాగిస్తుంది. అదే సమయంలో ఇరాన్ ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు, చమురు కొనుగోలు, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాల్లో ఇరాన్–భారత్ లు ఒక్కతాటిపై ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఏ పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.