మాదక ద్రవ్యాలను అరికడతాం

ఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేకన్​

Jun 26, 2024 - 19:35
 0
మాదక ద్రవ్యాలను అరికడతాం

నా తెలంగాణ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పోలీసులు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎస్పీ కేకన్​ పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్న వేళ వాటిని అరికట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్ధాలకు బానిసలుగా మారితే సమాజానికి ప్రమాదకారులుగా మారుతారన్నారు. ఈ ఆలోచనలను యువత విడిచిపెట్టాలన్నారు. వ్యక్తి అభివృద్దికి మాదకద్రవ్య అలవాటు నిరోధకంగా మారుతోందన్నారు. వారి ఆలోచనా, పరిపక్వతలను హరించి వేస్తుందని అన్నారు. 

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు ఈ మత్తుకు బానిసలుగా మారవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యా సంస్థలోనూ మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు టోల్​ ఫ్రీ నెంబర్​ 14446ను ప్రదర్శించి విద్యార్థులకు వివరించాలన్నారు.  ఈ ర్యాలీలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.