80 కోట్ల మందికి లబ్ధి
2024 నుంచి28 వరకు కొనసాగింపు
రూ. 17,082 కోట్ల అదనపు భారం
లోథాల్ లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ కు ఆమోదం
రాజస్థాన్, పంజాబ్ రోడ్ నెట్ వర్క్ కు రూ. 4,460 కోట్లు కేటాయింపు
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందిస్తున్న బియ్యాన్ని మరో మూడేళ్లపాటు 2028 వరకు ఉచితంగా అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. దీంతో కేంద్రంపై రూ. 17,082 కోట్ల ఆర్థిక భారం పడుతుందన్నారు. 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం అందించడం ద్వారా నిరుపేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. పోషకాహార లోపం, రక్తహీనత పిల్లల్లో, మహిళల్లో తగ్గించగలుగుతామన్నారు. నిరుపేదల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుందన్నారు.
గుజరాత్ లోని లోథాల్ లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ను అభివృద్ధికి ఆమోదం తెలిపామన్నారు. ఈ ప్రాజెక్ట్ రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల 15,000 ప్రత్యక్ష ఉపాధి లభిస్తుండగా, పరోక్షంగా మరో ఏడువేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు రూ. 4,460 కోట్ల పెట్టుబడితో రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2,280 కిలోమీటర్ల రోడ్ నెట్ వర్క్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. ఇది కనెక్టివిటీ, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిపై పెను ప్రభావం చూపుతుందని మంత్రి తెలిపారు.