ఏయిర్ విస్తారాకు బాంబు బెదిరింపు
Bomb threat to Air Vistara
3.5 గంటలు గాలిలో ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్న విమానం!
విమాన సిబ్బందిని నిలదీసిన భద్రతాధికారులు
హైజాక్ అయ్యే భయాందోళనల నేపథ్యంలో ఢిల్లీకి తీసుకొచ్చామని వివరణ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లండన్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. బుధవారం ఢిల్లీకి చేరిన ఈ విమానాన్ని వెంటనే అప్రమత్తమైన ఏయిర్ పోర్ట్ భద్రతా బలగాలు సేఫ్ జోన్ లోకి తరలించారు. ప్రయాణికులు, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం విమానాన్ని కూడా పూర్తిగా తనిఖీ చేసి బెదిరింపు ఉత్తిదే అని గుర్తించారు. విమానం టాయిలెట్ లో టిష్యూ పేపర్ పై బాంబు ఉన్నట్లుగా రాసి ఉండడంతో ఓ ప్రయాణికుడు సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. బాంబు బెదిరింపు వచ్చినా స్థానిక విమానాశ్రయంలో ఆపకుండా 3.5 గంటలపాటు ఎందుకు ప్రయాణించారని, జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత అని విమానసిబ్బంది, పైలెట్లను భద్రతా సిబ్బంది నిలదీశారు. విమానం హైజాక్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయని తమలో భయాందోళనలు ఉన్నందువల్లే నేరుగా ఢిల్లీకి తీసుకువచ్చామని వారు తెలిపారు. ఈ విమానంలో మొత్తం 300 మంది ప్రయాణిస్తున్నారు. ఈ విషయంపై ఏయిర్ పోర్ట్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.