సీఐఎస్ఎఫ్ లో తొలి మహిళా బెటాలియన్ ఏర్పాటు
మహిళా శక్తికి మరింత ప్రాధాన్యత
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని అన్ని రంగాల్లో మహిళలకు సమప్రాధాన్యతకు మలి అడుగు పడింది. సీఐఎస్ ఎఫ్ తొలి మహిళా బెటాలియన్ కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. 53వ సీఐఎస్ ఎఫ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి ఆదేశాల మేరకు ఈ దళంలో మహిళా బెటాలియన్‌ల ఏర్పాటు ప్రతిపాదనకు అంగీకారం లభించింది. దీంతో పురుషులతో తామేమీ తక్కువ కాదని మహిళలు భద్రతా రంగంలో అడుగిడి నిరూపించుకునేందుకు మరో బృహత్తర అవకాశం లభించినట్లయ్యింది. తొలి మహిళా బెటాలియన్ కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో సీఐఎస్ ఎఫ్ లో మహిళల భర్తీ ప్ర్రక్రియకు మరింత మార్గం సుగమమైంది. జవాన్లుగా మహిళలను ఎంపిక చేయడంలో మరిన్ని సన్నాహాలు ప్రారంభించనున్నారు. అంతేగాక మహిళల కోసం ప్రత్యే క బెటాలియన్, స్థలం, నివాసం, గృహాలు, వైద్యం వంటి తదితర ఏర్పాట్లను చేయనున్నారు. పశ్చిమాసియా, భారత దేశ చరిత్రలోనే ఇదో నూతనాధ్యాయంగా పేర్కొనవచ్చు. ఒక్కో బెటాలియన్ లో 1025మంది మహిళా సైనికులను నియమించుకోనున్నారు. వీరు విమానాశ్రయాలు, రైల్వే సంస్థలు, దేశంలోని అన్ని విభాగాల్లోని భద్రతా విధుల్లో నియమించనున్నారు. ప్రస్తుతానికి పలు భద్రతా విధుల్లో మహిళా సైనికులున్నా బెటాలియన్ ఏర్పాటు ఇదే తొలిసారి కావడం గమనార్హం. హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో సీఐఎస్ ఎఫ్ మహిళలకు భద్రతా విధులకు పరిమితులు విధించలేదు. అంటే ఎలాంటి చోటు, సమయం, తేదీ, వారం లాంటివి ఉన్నా వారి విధులను సక్రమంగా నిర్వహించాల్సిన కీలకమైన, కఠినమైన బాధ్యతలను అప్పగించినట్లయ్యింది. ఇప్పటికే సీఐఎస్ ఎఫ్ ప్రధాన కార్యాలయ నిర్మాణం, శిక్షణ, స్థల ఎంపిక తదితరాల ప్రక్రియ వేగంగా నడుస్తోంది.