బుల్‌డోజర్​ చర్యలపై సుప్రీం ఫైర్​

Supreme Fire on bulldozer actions

Nov 13, 2024 - 12:58
 0
బుల్‌డోజర్​ చర్యలపై సుప్రీం ఫైర్​
నిందితులను దోషులుగా ఎలా నిర్దరిస్తారు?
అధికారుల ఖర్చుతోనే నిర్మింపజేస్తాం!
పలు మార్గదర్శకాలు విడుదల
యూపీ బాధితుడికి రూ. 25 లక్షలు చెల్లించాలని ఆదేశం
అన్ని రాష్ర్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు పంపాలి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బుల్డోజర్ చర్యలపై అధికారులు న్యాయమూర్తులు కాలేరని నిందితులను దోషులుగా ఎలా నిర్ధరించి చర్యలకు దిగుతారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరాది రాష్ర్టాల్లోని ఇళ్లపై బుల్డోజర్​ చర్యలపై కేసును బుధవారం సుప్రీం కోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇళ్ల కూల్చివేతపై 15రోజుల నోటీసు లేకుండా నిర్మాణాలను కూల్చితే పూర్తి అధికారులే మళ్లీ వాటిని నిర్మించేందుకు అయ్యే ఖర్చును భరించాలని పేర్కొంది. 
 
యూపీకి చెందిన ఓ వ్యక్తి ఇంటి కూల్చివేత కేసులోనూ యోగి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. నిష్పాక్షిక విచారణ పూర్తికాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని, అలాంటి వ్యక్తుల ఇళ్లను కూల్చివేయడం అధికార దుర్వినియోగమేనని, చట్టవిరుద్దమని స్పష్టం చేసింది. దోషిగా నిర్డరించినా చట్టం ప్రకారం శిక్ష ఉంటుంది తప్పా, బుల్డోజర్లతో న్యాయం చేయలేమని వ్యాఖ్యానించింది. ఇళ్లను కూల్చివేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాయడమేనని మండిపడింది. దేశవ్యాప్తంగా కూల్చివేతలపై మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం బుల్‌డోజర్​ చర్యలపై మండిపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ఇల్లును కూల్చినా అది రాజ్యాంగానికి విరుద్ధమని తేల్చిచెప్పింది.
ఓ వ్యక్తి ఇంటిని అధికారులు ఏకపక్షంగా కూల్చివేస్తే వాళ్లు నిందితులే అవుతారని అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘించినట్లు మేం భావించాల్సిన ఉంటుందని హెచ్చరించారు. యూపీ కుటుంబంలోని ఓ ఇళ్లు కూల్చిన ఘటనలో రూ. 25 లక్షలు పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2019 అక్టోబరులో తన ఇంటిని కూల్చివేసినట్టు బాధితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడింది.
 
సుప్రీం 15 మార్గదర్శకాలు..
1. బుల్డోజర్ చర్యకు ఆదేశించినట్లయితే, దానిపై అప్పీల్ చేయడానికి సమయం ఇవ్వాలి.
2. రాత్రికి రాత్రే ఇళ్లు కూల్చివేస్తే, మహిళలు, పిల్లలు వీధుల్లోకి వస్తారు. బాధితులకు అప్పీలు చేసుకునేందుకు సమయం దొరకడం లేదు.
3. రోడ్లు లేదా నది ఒడ్డున అక్రమ నిర్మాణం వంటి అక్రమ ఆక్రమణలను మా మార్గదర్శకాలు పరిష్కరించవు.
4. షోకాజ్ నోటీసు లేకుండా ఏ నిర్మాణాన్ని కూల్చివేయొద్దు. 
5. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నిర్మాణ యజమానికి నోటీసు పంపాలి. నోటీసును ఇంటి గోడపై అతికించాలి.
6. నోటీసు పంపిన తర్వాత, 15 రోజుల సమయం ఇవ్వాలి.
7. కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు కూడా సమాచారం ఇవ్వాలి.
8. అటువంటి చర్యలపై నిఘా ఉంచేందుకు డీఎం, కలెక్టర్ నోడల్ అధికారులను నియమించాలి.
9. నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారో, ఎప్పుడు వింటారో, ఎవరి ముందు వింటారో నోటీసులో పేర్కొనాలి. నోటీసులు, ఆర్డర్‌ల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉండే డిజిటల్ పోర్టల్ ఉండాలి.
10. అధికారులు వ్యక్తిగత విచారణ జరపాలి. తుది ఉత్తర్వులు జారీ చేసి, నిర్మాణాన్ని కూల్చివేసేందుకు చర్యలు అవసరమా కాదా చెప్పాలి. 
11. ఆర్డర్ డిజిటల్ పోర్టల్‌లో ప్రదర్శించాలి.
12. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత, వ్యక్తికి 15 రోజులు అవకాశం ఇవ్వాలి తద్వారా అతను స్వయంగా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయవచ్చు, తొలగించవచ్చు. ఈ ఆర్డర్‌పై స్టే విధించకుంటే మాత్రం బుల్‌డోజర్‌ చర్యలు తీసుకుంటామన్నారు.
13. కూల్చివేత ప్రక్రియను వీడియోగ్రాఫ్ చేయాలి. దానిని భద్రంగా ఉంచి, కార్యాచరణ నివేదికను మున్సిపల్ కమిషనర్‌కు పంపాలి.
14. మార్గదర్శకాలను పాటించకపోవడం కోర్టు ధిక్కారంగా పరిగణించబడుతుంది. దీనికి అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కూల్చివేసిన కట్టడాన్ని తన సొంత ఖర్చుతో పునర్నిర్మించాలి, పరిహారం కూడా చెల్లించాలి. 
15. మా ఆదేశాలు దేశంలోని అన్ని రాష్ర్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు పంపాలి.