నా తెలంగాణ, మెదక్: విద్యార్థులు నాణ్యమైన గుణాత్మక విద్య నేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య విద్యార్థినులకు సూచించారు. శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను బక్కి వెంకయ్య పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులు సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి సమగ్రాభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై క్రమం తప్పకుండా చెక్ అప్ చేయాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మ దర్శనం..
అనంతరం బక్కి వెంకయ్య, కమిషన్ సభ్యులు ఏడుపాయల దుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక అధికారులు, పూజారులు చైర్మన్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ తోపాటు సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.