నా తెలంగాణ, నిర్మల్: విద్యార్థినులకు తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళ శారద అధికారులను ఆదేశించారు. నాలుగు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆమె నిర్మల్ జిల్లాలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, టాయిలెట్స్ ను పరిశీలించారు. బియ్యం, కూరగాయలు, ఇతర వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులతో ఏకాంతంగా మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సబ్జెక్టులకు సంబంధించి అధ్యాపకుల కొరత ఉందన్న విషయాన్ని విద్యార్థినులు చైర్ పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థినులు వివరించారు. విద్యార్థుల విన్నపాలకు సానుకూలంగా స్పందించిన చైర్ పర్సన్ తక్షణమే సమస్యలు పరిష్కరించాల్సిందిగా డీఈఓ ను ఆదేశించారు. మహిళలకు కమీషన్ ఏవిధంగా అండగా ఉంటుందో విద్యార్థినులకు వివరించారు. మహిళల సమస్యలపై మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లను క్లాస్ బోర్డ్ పై రాసి మహిళలందరికి తెలియజేయాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.
విద్యార్థినికి ఆర్థిక సాయం
నిర్మల్ పట్టణంలో కస్తూర్భా గాంధీ విద్యాలయంలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని అస్వస్థతతో బాధపడటం చూసి స్థానిక నిర్మల్ న్యూరో హాస్పటల్ డాక్టర్ నరసింహ రెడ్డి విద్యార్థినికి వైద్యం సాయం అందించాల్సిందిగా కోరారు. ఆ విద్యార్థినికి వైద్యం పర్యవేక్షణ చూడాల్సిందిగా డీఈఓ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.