పార్లమెంట్ ముట్టడికి రైతులు
Farmers under siege by Parliament
ఢిల్లీ–యూపీ సరిహద్దులోనే అడ్డుకున్న భద్రతాదళాలు
నిరసనలో పాల్గొంటున్న పది రైతు సంఘాలు
భారీగా ట్రాఫిక్ జామ్ లతో ప్రయాణికుల ఇక్కట్లు
లక్నో: యూపీలోని 10 రైతు సంఘాలు పార్లమెంట్ ముట్టడిస్తామని ప్రకటించాయి. సోమవారం ప్రకటించినట్లుగానే భారీ ఎత్తున రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పోలీసులు సరిహద్దు వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించి రైతులను అడ్డుకున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నోయిడా మహామాయ ఫ్లై ఓవర్ వద్ద రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో ఢిల్లీ, యూపీ పోలీసులు అలర్టయ్యి రైతులను అడ్డుకున్నారు. నోయిడాలో 163 సెక్షన్ విధించారు. రైతులు తరలివస్తున్న 45 కిలోమీటర్ల ప్రాంతంలో భారీగా భద్రతా దళాలను రంగంలోకి దింపారు.
రైతుల డిమాండ్లు..
భూసేకరణకు బదులుగా రైతులకు పది శాతం ప్లాట్లు ఇవ్వాలి.
రైతులకు 64.7 శాతం చొప్పున పరిహారం అందజేయాలి.
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం ఇవ్వాలి.
భూమి, భూమి లేని రైతుల పిల్లలకు ఉపాధి, పునరావాస ప్రయోజనాలన్నీ కల్పించాలి.
రైతు డిమాండ్లపై డిసెంబర్ 1న నోయిడా డీఎం మనీష్ పలువురు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రైతుల డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ఈ రైతుల ఆందోళనకు భారతీయ కిసాన్ పరిషత్ సుఖ్బీర్ ఖలీఫా, భారతీయ కిసాన్ యూనియన్ చెందిన పవన్ ఖతానాలు నాయకత్వం వహిస్తున్నారు.