కొనసాగుతున్న వాయిదాల పర్వం

లోక్ సభ, రాజ్యసభ లు 3కి వాయిదా

Dec 2, 2024 - 13:12
 0
కొనసాగుతున్న వాయిదాల పర్వం

తొలినాలుగురోజుల్లో 40 నిమిషాలే సభ కొనసాగింపు!
పట్టు వీడని విపక్షాలు, ఇండి కూటమితో ఖర్గే సమావేశం
హాజరు కాని టీఎంసీ ఎంపీలు
భారత్​–చైనాపై జై శంకర్​ ప్రసంగానికి ఫుల్​ స్టాప్​
బ్యాంకింగ్​ చట్ట సవరణ బిల్లుకు లభించని మోక్షం
సబర్మతి రిపోర్ట్​ చిత్రాన్ని వీక్షించనున్న ప్రధాని మోదీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్​ వాయిదా పర్వం కొనసాగుతుంది. శుక్రవారం వాయిదా పడిన ఉభయ సభలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష పార్టీలు తమ డిమాండ్​ లతో నిరసన చేపట్టాయి. దీంతో 15 నిమిషాలపాటు సమావేశాలను వాయిదా వేసి అనంతరం సభలు ప్రారంభమయ్యాయి. అయినా విపక్షాలు పట్టువీడకపోవడంతో సమావేశాలను 3కి వాయిదా వేశారు. 

నవంబర్​ 25న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు తొలినాలుగు రోజుల్లో కేవలం 40 నిమిషాలపాటే కొనసాగాయి. సోమవారం లోక్​ సభ సమావేశాలు 14 నిమిషాలు, రాజ్యసభ సమావేశాలు కేవలం 15 నిమిషాలపాటే కొనసాగాయి. వరుసగా ఐదో రోజు కూడా లోక్​ సభ, రాజ్యసభ రెండింటిలోనూ అదానీ, సంభాల్​, మణిపూర్​, ధరల పెరుగుదల తదితరాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. చర్చించేందుకు సమయం కేటాయిస్తామని చెప్పినా పట్టు వీడకపోవడంతో ఉభయ సభలను పార్లమెంట్​ స్పీకర్​, రాజ్యసభ చైర్మన్​ లు వాయిదా వేశారు. 

సమావేశానికి ముందు ఇండి కూటమి నేతలు మల్లిఖార్జున ఖార్గేతో సమావేశమయ్యారు. రాహుల్​ గాంధీ, కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా టీఎంసీ సమావేశాలు రద్దు, కాంగ్రెస్​, కూటమి నేతల తీరుపై ఆగ్రహంగా ఉంది. దీంతో సమావేశానికి టీఎంసీ నేతలు హాజరు కాలేదు. పశ్చిమ బెంగాల్​ కు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్​, కూటమి నేతలు నోరు విప్పకపోవడం పట్ల మమతా బెనర్జీ తమ నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. అందుకే టీఎంసీ ఎంపీలు కూటమి సమావేశానికి హాజరకాలేదు.

భారత్​–చైనా అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్​.జైశంకర్​ లోక్​ సభలో మాట్లాడాల్సి ఉంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ బ్యాంకింగ్​ చట్ట సవరణ బిల్లును కూడా సమర్పించనుండగా సభ రద్దయ్యింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్​ లైబ్రరీలోని బాలయోగి ఆడిటోరియంలో ‘సబర్మతి రిపోర్ట్​’ చిత్రాన్ని వీక్షించనున్నారు. గోద్రా, గుజరాత్​ అల్లర్ల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా నవంబర్ 15న విడుదలైంది.