ప్రతీ మహిళకు సముచిత గౌరవం
అదే తన అభిప్రాయం సినీనటీ, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ కాంగ్రెస్ నేత సుప్రియకు కౌంటర్
చండీగఢ్: బీజేపీ నేతృత్వంలో దేశంలోని ప్రతీ మహిళకు సముచిత గౌరవం దక్కాలన్నదే తన అభిప్రాయమని ప్రముఖ బాలీవుడ్ సినీనటి, హిమాచల్‌ప్రదేశ్ మండి నుంచి ఎంపికైన బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు. వృత్తిని బట్టి గానీ, మరో విషయాన్ని బట్టి గానీ వారి మర్యాద, గౌరవాలకు భంగం వాటిల్లేలా చేయొద్దని రనౌత్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా చేసిన వ్యాఖ్యలకు మంగళవారం చండీగఢ్ఎయిర్పోర్టు నుంచి వెళుతుండగా మీడియాతో సమాధానమిచ్చారు. హిమాచల్‌లోని మండి ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఛోటా కాశీ అంటారని గొప్ప కీర్తి ఉందని తెలిపారు. ఈ స్థానం నుంచి తనకు అవకాశం లభించడం సంతోషకరమని తెలిపారు. తన 20 యేళ్ల కెరీర్లో ఎన్నో రకాల పాత్రలు పోషించానని వివరించారు. రాణి, గూడాఛారి, దేవత, రాక్షసుడు, వేశ్య, విప్లవ నాయకురాలిగా తన వృత్తి ధర్మాన్ని పాటించానని కంగనా పేర్కొన్నారు. వృత్తి ధర్మాన్ని సరిగ్గా పాటించినంత మాత్రాన మహిళల మర్యాద, గౌరవాలు ఏ మాత్రం తగ్గబోవని తాను భావిస్తున్నట్లు కంగనా రనౌత్కాంగ్రెస్ నాయకురాలు సుప్రియకు గౌరవంగానే కౌంటరిచ్చారు.