ఇథనాల్​ ఎగుమతులతో రైతులకు మేలు

రెండేళ్లలో 1000 కోట్ల లీటర్ల ఇథనాల్​ అవసరం 2030 నాటికి పెట్రోల్​ లో 20 శాతం ఇథనాల్​ కలపాలని నిర్ణయం కేంద్రమంత్రి అమిత్​ షా

Aug 10, 2024 - 20:15
 0
ఇథనాల్​ ఎగుమతులతో రైతులకు మేలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇథనాల్​ ఎగుమతుల ద్వారా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. శనివారం న్యూ ఢిల్లీలో జరిగిన నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ కో–ఆపరేటివ్​ షుగర్​ ఫ్యాటరీస్​ లిమిటెడ్​ కార్యక్రమంలో పాల్గొని అమిత్​ షా ప్రసంగించారు. 

చెరకు, మొక్కజొన్న, విరిగిన బియ్యం, వృథా చేసిన పండ్లు, వెదురు వంటి వనరులను ఉపయోగించి ఇథనాల్ ఉత్పత్తికి బహుళ-డైమెన్షనల్, ఫ్యూచరిస్టిక్ విధానాన్ని అవలంబించాలని షా కోరారు. ఇథనాల్ ఉత్పత్తి లాభదాయకమైన, ఆచరణీయమైన వ్యాపారమని, రెండేళ్లలో దేశానికి 1,000 కోట్ల లీటర్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. 

పెట్రోలులో ఇథనాల్‌ను జీవ ఇంధనంగా కలిపే పరిమితిని ప్రభుత్వం పెంచుతున్నదని తెలిపారు. 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ లక్ష్యాన్ని చాలా ముందుగానే సాధించవచ్చని షా చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ శాతాన్ని 26 శాతానికి పెంచుతామని కూడా ఆయన పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ చొరవ కారణంగా గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ఏర్పడిందని, ఇది ఇథనాల్ ఎగుమతులకు అవకాశాలను సృష్టిస్తుందని, చివరికి రైతులకు మేలు చేస్తుందని షా తెలిపారు. భవిష్యత్తులో ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దేశం తన ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉండాలని అమిత్​ షా ఉద్ఘాటించారు.