రాష్ట్రపతి ముర్మూకు ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’
తైమూర్ లెస్టే అత్యున్నత పురస్కారం
దిలీ: మహిళా సాధికారత కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అంకితభావం గొప్పదని తైమూర్ లెస్టే అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్టా అన్నారు. విద్యా, సామాజిక సంక్షేమం, ప్రజాసేవలో ఆమె సేవలను కొనియాడారు. శనివారం రాష్ట్రపతి ముర్మూకు తైమూర్ లెస్టే అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’తో సత్కరించారు. న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని రాష్ట్రపతి శనివారం తైమూర్ లెస్టేకు చేరుకున్నారు.
అనంతరం రాష్ట్రపతి ముర్మూ మాట్లాడుతూ భారత్–తైమూర్ లెస్టే మధ్య స్నేహ బంధాలకు ప్రతిబింబం ఈ పురస్కారమని హర్షం వ్యక్తం చేశారు.
తైమూర్ రాజధాని నగరం దిలీలో ముర్మూ భారత మాజీ రాష్ట్రపతి వివి గిరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవాస భారతీయుల సభలో ప్రసంగించారు. తైమూర్ లెస్టే అధ్యక్ష కార్యాలయంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహాకారం పెంపొందించడంపై చర్చలు జరిగాయి. రాష్ట్రపతి ముర్మూ ఆగ్నేయాసియాలో ఇది తొలి పర్యటన కావడం విశేషం.