రెండో పెళ్లికి ప్రోత్సాహం
వితంతులకు ఝార్ఖండ్ ప్రభుత్వ కొత్త పథకం రూ. 2 లక్షల సాయం
రాంచీ: ఏ అండా లేని వితంతుల కోసం ఝార్ఖండ్ ప్రభుత్వం ఓ కొత్త పథకం ప్రవేశపెట్టింది. రెండో పెళ్లి చేసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని సర్కారు భావిస్తున్నది. భర్త చనిపోయిన మహిళలు రెండో పెళ్లికి ఇష్టపడరు. ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేయాలనుకుంటారు. ఈ క్రమంలో ఎదురయ్యే కష్టాలను భరించడానికి సిద్ధంగా ఉంటారు. తమ సుఖసంతోషాల గురించి ఎంత మాత్రం పట్టించుకోరు. పైగా సమాజం కూడా కొన్ని కట్టుబాట్ల పేరుతో రెండోపెళ్లిని చిన్నచూపు చూస్తుంది. అలాంటి మహిళలకు భరోసా కల్పించాలనుకుంటున్న ఝార్ఖండ్ ప్రభుత్వం విధ్వా పునర్వివాహ్ ప్రోత్సాహ్ యోజన పేరుతో వితంతువులు రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. పెళ్లి చేసుకుని ఆ సర్టిఫికెట్‌నీ, చనిపోయిన భర్త మరణధ్రువీకరణ పత్రాన్నీ సమర్పిస్తే వారి ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తున్నది. పెళ్లైన ఏడాదిలోపే ఈ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకీ, పెన్షన్లు తీసుకునేవారికీ ఈ పథకం వర్తించదు. ఏ అండా లేనివారిని ఆదుకోవాలనే ఈ నిర్ణయం.