గ్లోబల్ స్పేస్ ఎకానమీని 10 శాతం విస్తరించే యోచన
ఇస్రో చైర్మన్ డా. సోమనాథ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రానున్న పదేళ్లలో గ్లోబల్ స్పేస్ ఎకానమీని 10 శాతానికి విస్తరించాలని భారత ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని ఇస్రో చైర్మన్ డా.ఎస్. సోమనాథ్ తెలిపారు. భారత్ ఈ రంగంలో ఇప్పటివరకు కేవలం 2 శాతం వాటాను మాత్రమే కలిగి ఉందన్నారు. శనివారం న్యూఢిల్లీలో ఇండియన్ స్పేస్ ఒడిస్సీ ఇన్ సెర్చ్ ఆఫ్ న్యూ ఫ్రాంటియర్స్ అనే అంశంపై సర్దార్ పటేల్ స్మారక ఉపన్యాసం 2024 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ఇండియన్ స్పేస్ పాలసీ 2023ని ప్రారంభించిందని, ఎఫ్‌డిఐని సరళీకరించిందని తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రస్తుతం 200కు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని, 2014లో ఇది ఒక్కటేనని ఆయన అన్నారు. అంతరిక్ష రంగంలోనూ భారత్ దిగుమతులను పూర్తిగా తగ్గించుకునే దిశగా ముందుకు వెళుతుందన్నారు. అదే సమయంలో ఎగుమతులను పెంచుతుందన్నారు. చంద్రయాన్ 3 విజయం భారత్ కు కీలక మైలురాయిగా సోమనాథ్ అభివర్ణించారు. దీంతో దేశ సామర్థ్యం ప్రపంచదేశాల్లో మారుమోగిందన్నారు. ఇస్రో అన్ క్రూడ్ మిషన్ గగన్‌యాన్ ను ప్రారంభించాలని యోచిస్తోందని డా. సోమనాథ్ స్పష్టం చేశారు.