గొర్రెలను మేశారు మూడో రోజు ఏసీబీ విచారణ
గొర్రెల అవినీతి కేసులో పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను మూడో రోజు విచారిస్తున్నారు.
నా తెలంగాణ, హైదరాబాద్: గొర్రెల అవినీతి కేసులో పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను మూడో రోజు విచారిస్తున్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో వీరి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే గొర్రెల స్కామ్‌కు సంబంధించి విచారణలో వీరి వాంగ్మూలాలను రికార్డు చేశారు. ఈ కుంభకోణంలో మరికొందరి పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌కు నిందితులకు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ కుంభకోణంలో రెండు కోట్ల పది లక్షల రూపాయలు దారి మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఐదు రోజులపాటు వీరిని విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే అన్ని విభాగాల్లో జరిగిన అవకతవకలపై ఒక్కొక్కటిగా అవినీతిని బయటకు లాగుతోంది. నిందితులిద్దరు రూ. 2.10 కోట్ల నిధులను పక్కదారి పట్టించినట్లు ఏసీబీ విచారణ సందర్భంగా స్పష్టం అవుతోంది.