అదంతా డ్రగ్సే..
విశాఖ కంటెయినర్ బస్తాలకు ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తి వివరాలు వెల్లడించిన అధికారులు
విశాఖపట్నం: విదేశాల నుంచి విశాఖకు కంటెయినర్లో 25వేల కిలోలు వచ్చింది డ్రగ్సేనని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైనట్లు సీబీఐ పేర్కొంది. నివేదికపై ఆదివారం అధికారులు మీడియాకు వివరాలందించారు. కంటెయినర్‌లోని బస్తాల్లో ఓపియం, మార్ఫిన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కలిన్లు ఉన్నట్లుగా టెస్టుల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు. 49 నమూనాల్ని పరీక్షిస్తే అందులో 48 నమునాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలిందని అధికారులు వివరించారు. అయితే డ్రగ్స్ ఎంత పరిమాణంలో ఇందులో కలిసి ఉందనేది తేలాల్సి ఉందన్నారు. 20 శాతం మేర కలిసి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ నిఘా ముమ్మరం చేసి ఈ భారీ డ్రగ్స్ రాకెట్‌ను గుట్టును రట్టు చేసింది. కాగా డ్రగ్స్ విలువ ఎంతన్నది అధికారులు పేర్కొనలేదు.