గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్ నలుగురు మావో అగ్రనేతలు మృతి
వివరాలు వెల్లడించిన ఎస్పీ నీలోత్పల్
గడ్చిరోలి: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు. కాల్పుల సందర్భంగా పారిపోయిన నక్సలైట్ల కోసం పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే చనిపోయిన నలుగురు నక్సలైట్లు ఎవరన్న విషయంపై స్పష్టత లేదు. వీరంతా అగ్రనేతలేననే ప్రచారం కొనసాగుతోంది. వీరి నుంచి భారీ సంఖ్యలో ఏకె–47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌పై గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ పలు వివరాలను వెల్లడించారు. కోలమర్క అడవిలో ఈ ఎన్‌కౌంటర్ ఘటన చోటు చేసుకుందన్నారు. నక్సలైట్ల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఆపరేషన్ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురి మృతదేహాలను గుర్తించామని, మరింత మంది మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు లేకపోలేదన్నారు. నక్సలైట్ల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. చనిపోయిన నక్సలైట్లపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 36 లక్షల రివార్డు కూడా ప్రకటించిందని తెలిపారు. చనిపోయిన వారెవరన్న విషయాన్ని ఇంకా ధృవీకరించలేదని ఎస్పీ నీలోత్పల్ స్పష్టం చేశారు. కాగా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారంతా మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూర్ ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.