సెప్టెంబర్ 6న ‘ఎమర్జెన్సీ’
విడుదల ప్రకటించిన ఎంపీ కంగనా రౌనత్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎంపీ కంగనా రౌనత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా 2024 సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ విషయాన్ని కంగనా రౌనత్ సామాజిక మాధ్యమం ద్వారా మంగళవారం వెల్లడించింది. దీంతో ఎమర్జెన్సీ విడుదలవుతుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరదించినట్లయ్యింది. బీజేపీలో చేరిన కంగనా హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం కైవసం చేసుకుంది. అప్పటి నుంచి రాజీయాల్లోనూ క్రియాశీలకంగా కొనసాగుతోంది. సినిమాలు, ప్రజాసేవ వేరంటూ పలుమార్లు కంగనా ప్రకటించింది. ఈమె ఎంపీగా ఎన్నికయ్యాక ఎమర్జెన్సీ చిత్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ చిత్రంలో కంగనా రౌనత్ ఇందిరాగాంధీ పాత్రను పోషించడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడటం పట్ల అభిమానాలు నిరాశలో ఉండగా తాజా ప్రకటనతో అభిమానుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.