మదర్సా సర్వే అధికారులపై దాడులు

37 మందిపై ఎఫ్ ఐఆర్​ నమోదు

May 19, 2024 - 18:42
 0
మదర్సా సర్వే అధికారులపై దాడులు

అహ్మాదాబాద్​: అహ్మాదాబాద్​ లోని ఓ మదర్సాను సర్వే చేసేందుకు వచ్చిన అధికార బృందంపై బయట నిలబడ్డ కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం ఈ దాడి జరిగింది. సర్వే చేసేందుకు అధికారులు దరియాపూర్‌ మదర్సాకు చేరుకోగానే తలుపులను నిర్వాహకులు మూసివేశారు. అధికారులపై దాడులకు పాల్పడ్డారు.  తలుపులు మూయడాన్ని ఫోటోలు, వీడియోలు తీస్తున్న సందీప్​ పటేల్​ అనే అధికారిపై మదర్సా బయట నిలబడ్డ వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వెంటనే అధికారులు దరియాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్​ ఐఆర్​ నమోదు చేసి విచారణ చేపట్టారు.
దాడికి పాల్పడ్డ వ్యక్తులను ఫర్హాన్​, ఫైజల్​ లుకా గుర్తించారు. వీరితోపాటు మరో 35 మందిపై కేసు నమోదు చేశారు. 

జాతీయ కమిషన్​ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి, గుజరాత్‌లోని 1100 కంటే ఎక్కువ మదర్సాలలో సర్వే నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్ నగరం, గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 205 మదర్సాలపై సర్వే కొనసాగుతోంది. మదర్సాలకు వెళ్లే ముస్లిమేతర పిల్లలను విచారించి మ్యాపింగ్​ చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. మ్యాపింగ్ చేయని మదర్సాల మ్యాపింగ్‌కు కూడా ఆర్డర్లు ఇచ్చారు. మదర్సాలో చదువుతున్న పిల్లలు సాధారణ పాఠశాలలో చదవడం అవసరమా కాదా అని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

మదర్సాలను నిర్వహిస్తున్న ట్రస్టులు, లేదా వ్యక్తుల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. విరాళంగా అందిన సొమ్మును ఏ రూపంలో ఖర్చు చేస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.