గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి
Election commotion started in the villages
పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
ప్రజల సమస్యల పరిష్కారానికి పోటీ
ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర
బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ
నా తెలంగాణ, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో గ్రామాల్లో ఇప్పటినుంచి ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఒక సవాల్ గా స్వీకరిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో తమ పట్టు సాధించాలనే పట్టుదలతో ఇరు పార్టీలు భావిస్తూ ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 2వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక పాలన విధిస్తూ అధికారులకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సర్పంచులు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అని స్థానిక నాయకులు ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో గ్రామస్తులు మాజీ సర్పంచ్ లు తాజా మాజీ సర్పంచ్లతో పాటు మరికొందరు ఆశావాహులు మంచి పేరు సంపాదించేందుకు ఇప్పటినుంచే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పోటీ పడుతున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోయినా చురుకుగా పాల్గొంటూ అందరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉన్నదని తమను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఇప్పటినుంచి ప్రచారం చేసుకుంటూ తాము కూడా సర్పంచ్ పదవికి పోటీలో ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడం గమనార్హం.
ఎవరి వ్యూహాలు వారివి..
స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా స్వీకరిస్తున్న ప్రధాన పార్టీలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని యోజనలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అధికారంలో తమ పార్టీ ఏ ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికంగా సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా బీజేపీ ప్రజల అభిమానం, మోదీ ప్రభావంతో తమ పార్టీ అధిక సీట్లు గెలుపొందుతుందనే ధీమాలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో చతికిల పడ్డా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్లు నిలుపుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ప్రచారం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించి ఎక్కువ సీట్లు గెలుపొందాలని చూస్తోంది. ఎప్పటిలాగే ఇతర పార్టీలకంటే తమ పార్టీ అధినేతలను ముందుగా ప్రకటించేందుకు టిఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేక అధికారులపై పని భారం..
గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన విధించిన సంగతి విదితమే. పంచాయతీ కార్యదర్శులు మండల స్థాయి అధికారులను నియమించి ఒక్క అధికారికి రెండు నుంచి మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించింది. దీంతో ప్రత్యేక అధికారులకు పనిభారం అధికమై ఇక్కడ శాఖాపరమైన పనుల నిమిత్తం కార్యాలయాల్లో పనులు చేస్తూనే గ్రామాల్లో పనులను చూసుకోవడంతో తమపై పని భారం పెరిగి మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని అంటున్నారు. కార్యాలయాల్లో శాఖ పనులు ఉండడం వల్ల గ్రామాలపై పర్యవేక్షణ చేయలేకపోతున్నామని ప్రత్యేక అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన నాటి నుంచి రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. పాత రిజర్వేషన్లను కొనసాగిస్తూ ఎన్నికలకు వెళతారా లేక బీసీ రిజర్వేషన్లు పెంచాక వెళ్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెంచిన పలువురు బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికలకు వెళితే తామంతా ఏకమై స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని బీసీ సంఘాల నాయకులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కులగణన ఇప్పటిలో సాధ్యపడదని పాత రిజర్వేషన్ల ఆధారంగానే స్థానిక సంస్థలకు వెళ్తామని ప్రకటించగా ఈనెల 18న రవీంద్ర భారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనను చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పడం పలువురికి ఆసక్తిని రేకెత్తించింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు పాత రిజర్వేషన్ల ఆధారంగానే వెళ్తారా?లేక కులగనన చేపట్టి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే వెళ్తారా?అనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.