నా తెలంగాణ, మెదక్: సెప్టెంబర్ 17తో తెలంగాణలో ప్రతీ ఒక్కరికి అవినాభావ సంబంధముంది. కొందరు విమోచన దినం, మరికొందరు సమైక్యత వజ్రోత్సవాలని జరుపుకుంటారు. విభిన్న రూపాల్లో ఈ తేదీన ఉత్సవాలు నిర్వహించుకుంటున్నప్పటికీ అప్పట్లో నిజం నిరంకుశ పాలన పోరాటంలో అనేకమంది అమరులయ్యారు. ఆలోచనా తీరులో భేదభావాలతో కొందరు పోరాట స్వరూపాలను మార్చేలా ఉత్సవాలను నిర్వహించుకుంటుంటే, మరికొందరు పోరాటస్ఫూర్తిని చాటేలా, విద్రోహ శక్తులకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఏళ్లపాటు ఆర్థిక శ్రమ దోపిడీ, సంప్రదాయ, సాంస్కృత్రిక దోపిడీకి అడ్డుకట్ట పడింది.
సాయుధ పోరాటం ప్రపంచ పోరాటాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ పోరాటంలో మూడువేల తెలంగాణ గ్రామాలు భూస్వాముల పీడ నుంచి విముక్తి పొందాయి. పది లక్షల ఎకరాల భూమి దున్నేవారికే (రైతులకు) దక్కింది. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో ఎందరో మహానీయులు అసువులు భాశారు. దేశంలో జరిగిన ఉద్యమాలలో సాయుధ పోరాటం ఓ కీలకోద్యమంగా చెప్పుకోవచ్చు.
వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం 75 యేళ్ల క్రితం జరిగిన ఈ పోరాటం 1946–51 మధ్య ఐదేళ్లపాటు కొనసాగింది. 4,500మంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారు. ఈ ఉద్యమ తీరును అమెరికన్ పాప్ స్టార్ పాల్ రాబ్సన్ గానం చేశాడు. చిత్తప్రసాద్, సునీల్ జైన్, గోఖలే లాంటి వారికి జీవం పోసింది. పాబ్లొ నెరుడా, కిషన్ చందర్ వరకు ఈ పోరాటంపై అనేక రచనలు చేశారు. ఉర్దూ, హిందీ, మరాఠీ, బెంగాళీ, పంజాబీ భాషల్లో ఉద్యమంపై అనేక రకాల సాహిత్యం, విశ్లేషణ, పోరాట పటిమ, తీరు తెన్నులపై అనేక రకాల పుస్తకాలు ప్రచూరితమయ్యాయి. కథలు, నవలలు, నాటికలు, పాటలు, ఆత్మకథలు, బుర్రకథలు రూపంలో నేటికీ ఇవి అజరామరంగానే ఉన్నాయి.
ఆరుద్ర, దాశరథి, సోమసుందర్ లాంటి కవులు ఈ ఉద్యమాన్ని, పోరాట తీవ్రతను వర్ణిస్తూ మహాకావ్యాలు రచించారు. నాజీల ఆకృత్యాలను పోలుస్తూ కాళోజీ కావ్యధార కురిపించారు.
పోరాటానికి విభిన్న రూపాలు లభించినప్పటికీ ఆనాటి పోరాటంలో అమరులైన మహానీయులను తెలంగాణ సమాజం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి త్యాగాల పునాదుల మీదే తెలంగాణ సమాజం నిర్మితమైందనేది జగమెరిన సత్యం.