అభయ కాదు.. భస్మాసుర హస్తమే!

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

Jun 19, 2024 - 21:00
 0
అభయ కాదు.. భస్మాసుర హస్తమే!

నా తెలంగాణ, నిర్మల్: కాంగ్రెస్ పార్టీ చిహ్నం అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బుధవారం నిర్మల్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల విషయంలో రాష్ట్ర సర్కారు తీరును దుయ్యబట్టారు. రైతు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా సాయం అందించాలని తెలియదా? లేకపోతే కుంటి సాకులతో దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎండాకాలం పంట సాగుకు సహాయం ఇవ్వలేదని, వానాకాలం పంట సాగుకు కూడా సాయం ఇవ్వకపోతే రైతులు సాగు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.  వానాకాలం పంటల సాగు మొదలయి నెల అవుతోందని పెట్టుబడి కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా ఎలాంటి నిబంధనలు పెట్టకుండా రైతులందరికీ సాయం అందించాలని ఏలేటి మహేశ్వర్​ రెడ్డి డిమాండ్ చేశారు.